కలం, నల్లగొండ: నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అన్ని డివిజన్లను సమానంగా అభివృద్ధి చేయడమే తమ నగరపాలక సంస్థ ప్రధాన లక్ష్యమని మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి (Burri Chaitanya) స్పష్టం చేశారు. ఎన్నికల వరకే రాజకీయాలని, గెలిచిన తర్వాత పార్టీలకు అతీతంగా నల్లగొండను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తామని ఆమె పునరుద్ఘాటించారు. కార్పొరేషన్ పరిధిలో ఏ ఒక్క డివిజన్‌పై కూడా ఎలాంటి వివక్ష చూపబోమని తేల్చిచెప్పారు.
రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రత్యేక సహకారంతో నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్‌ను అన్ని రంగాల్లో సమగ్రంగా అభివృద్ధి చేస్తామని మేయర్ వెల్లడించారు. నగరంలోని సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు ఇకపై ప్రతిరోజూ ఒక డివిజన్‌లో పర్యటించి స్థానిక ప్రజలతో నేరుగా మాట్లాడతానని ఆమె ప్రకటించారు. నగరంలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సీసీ రోడ్ల నిర్మాణంతో పాటు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులను వేగవంతం చేస్తున్నట్లు తెలిపారు.
కార్పొరేషన్‌లోని అన్ని డివిజన్లలో వేసవిలో కూడా తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. స్థానిక సమస్యలను తమ దృష్టికి లేదా మున్సిపల్ కార్పొరేషన్ సాధారణ సమావేశాల దృష్టికి తీసుకువస్తే ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. నల్లగొండను ఒక మోడల్ కార్పొరేషన్‌గా తీర్చిదిద్దడమే ధ్యేయంగా పనిచేస్తున్నామని, ప్రజలు, ప్రజాప్రతినిధులు అందరూ మున్సిపల్ పాలనకు సహకరించాలని మేయర్ కోరారు.

