కలం, నల్లగొండ: నల్లగొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వారసత్వ రాజకీయాలకు, పారాచూట్ నాయకులకు పట్టభద్రులు తమ ఓటుతో బుద్ధి చెప్పాలని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) ఎమ్మెల్సీ అభ్యర్థి నలమాస శ్రీకాంత్ గౌడ్ (Srikanth Goud) పిలుపునిచ్చారు. శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని శాలిని రెసిడెన్సీలో పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
విద్యార్థుల మరణాలకు గత పాలకుల వైఖరే కారణం..
ఈ సందర్భంగా బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల విధానాలపై ఆయన పలు ఆరోపణలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీల వల్ల విద్యార్థుల పదేళ్ల కష్టం, తల్లిదండ్రుల ఆశలు ఆవిరయ్యాయని, నిరుద్యోగుల జీవితాలు రోడ్డున పడ్డాయని శ్రీకాంత్ గౌడ్ విమర్శించారు. పేపర్ లీకేజీలకు బాధ్యత వహిస్తూ కేటీఆర్ ఎందుకు రాజీనామా చేయలేదని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 నుంచి 61 ఏళ్లకు పెంచడం వల్ల నిరుద్యోగుల అవకాశాలు దెబ్బతిన్నాయని, ప్రవళిక ఆత్మహత్య, ఇంటర్మీడియట్ విద్యార్థుల మరణాలకు గత పాలకుల వైఖరే కారణమని ఆరోపించారు.
హామీలపై కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలి..
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నీట్, యూజీసీ నెట్ పేపర్ లీకేజీలపై సమాధానం చెప్పాలని, ఏటా రెండు కోట్ల ఉద్యోగాల హామీ ఏమైందని నిలదీశారు. రాష్ట్రంలోని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై మాట్లాడుతూ.. ఉద్యోగాల క్యాలెండర్ పేరుతో నిరుద్యోగుల వయసు పెరుగుతోంది తప్ప ఉద్యోగాలు మాత్రం రావడం లేదన్నారు. మెగా డీఎస్సీ, పోలీసు నియామకాలు, యూత్ డిక్లరేషన్‌లో ఇచ్చిన స్కూటీలు, విదేశీ విద్యా ఉపకార వేతనాల హామీలపై కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
కృష్ణా జలాల తరలింపును అడ్డుకుంటాం..
కృష్ణా జలాల విషయంలో ఇక సహించేది లేదని, తెలంగాణ నీటిని తరలిస్తే యుద్ధమేనని శ్రీకాంత్ గౌడ్ హెచ్చరించారు. ‘పల్నాడు వాటర్ గ్రిడ్’ పేరుతో తెలంగాణ నీటిని ఆంధ్రప్రదేశ్‌కు తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ‘అమరజీవి జలధార’ ప్రాజెక్టు పనులపై రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా ఉండటం సరికాదని విమర్శించారు. కృష్ణా జలాల తరలింపును అడ్డుకోవడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విఫలమయ్యారని ఆయన ఆరోపించారు.
నల్గొండ రైతుల నీటి హక్కులను కాపాడేందుకు కవిత నాయకత్వంలో రైతులను సమీకరించి నాగార్జునసాగర్ వద్ద భారీ ప్రజా ఉద్యమం చేపడతామని, ఫ్లోరోసిస్‌తో బాధపడిన నల్గొండకు మళ్లీ నీటి కష్టాలు రానివ్వబోమని స్పష్టం చేశారు. సామాజిక న్యాయం మాటల్లో కాకుండా చేతల్లో చూపించాలని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రాజ్యాధికారంలో సముచిత వాటా కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.
కాకతీయ యూనివర్సిటీ ఉద్యమాల నుంచి ఎదిగిన సామాన్య బిడ్డగా అశోక్‌నగర్ నిరుద్యోగుల నుంచి యూనివర్సిటీ విద్యార్థుల వరకు ప్రతి సమస్యపై పోరాడుతానని తెలిపారు. జర్నలిస్టులకు కూడా చట్టసభల్లో తగిన ప్రాతినిధ్యం కల్పించేలా కృషి చేస్తానన్నారు. కోట్లు ఉన్న నాయకులకు కాకుండా కొట్లాడే ఉద్యమకారులకు పట్టం కట్టాలని కోరుతూ, రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని, రాజకీయ ఒత్తిళ్లు ఉంటే కనీసం రెండో ప్రాధాన్యత ఓటు అయినా వేసి గెలిపించాలని పట్టభద్రులకు శ్రీకాంత్ గౌడ్ విజ్ఞప్తి చేశారు.

