కలం, నల్లగొండ బ్యూరో: ఉమ్మడి నల్లగొండ (Nalgonda) జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గత మూడు రోజులుగా 46 డిగ్రీల రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో నిప్పుల కొలిమిలా మారిన జిల్లాను, ఒక్కసారిగా వచ్చిన అకాల వర్షం వణికించింది. ఎండ వేడి నుంచి ఉపశమనం లభించినప్పటికీ, ఈదురు గాలులు సృష్టించిన బీభత్సం సామాన్య ప్రజలను, రైతన్నలను కోలుకోలేని దెబ్బ తీసింది. సాయంత్రం వరకు ఎండ తీవ్రతతో ఉక్కిరిబిక్కిరి అయిన ప్రజలకు, ఒక్కసారిగా ఆకాశం నల్లని మబ్బులతో కమ్ముకోవడంతో ఏం జరుగుతుందో అర్థం కాలేదు. గాలి వేగం పెరగడంతో పెను తుపానును తలపించేలా ఈదురు గాలులు వీచాయి. భారీ శబ్దంతో వడగండ్ల వాన కురవడంతో జనజీవనం పూర్తిగా స్థంభించిపోయింది. ఈదురుగాలుల ధాటికి వందలాది చెట్లు నేలమట్టమయ్యాయి.
నకిరేకల్ పట్టణంతో పాటు పలు మండలాల్లో విద్యుత్ లైన్లు తెగిపడటంతో పాటు, భారీ సంఖ్యలో విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. ప్రధాన రహదారులపై చెట్లు కూలడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో జిల్లాలోని చాలా ప్రాంతాలు అంధకారంలో మునిగిపోయాయి. మరోవైపు అకాల వర్షం రైతుల పాలిట శాపంగా మారింది. ప్రధానంగా ధాన్యం కొనుగోలు సెంటర్లలో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. ఒకవైపు ఎండ తీవ్రతతో పంట దిగుబడి తగ్గి నష్టపోయాం. ఇప్పుడు అమ్మకానికి తెచ్చిన ధాన్యం కళ్లముందే కొట్టుకుపోతుంటే ఏం చేయాలో పాలుపోవడం లేదంటూ రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. టార్పాలిన్లు కప్పే లోపే భారీ వర్షం పడటంతో ధాన్యం రాశులన్నీ నీటి పాలయ్యాయి. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని రైతన్నలు ఆర్తనాదాలు చేస్తున్నారు.

