కలం, నల్లగొండ: జిల్లా రైతులకు ఎంతో ప్రయోజనం చేకూర్చనున్న పతంజలి పామ్ ఆయిల్ ప్రాసెసింగ్ కంపెనీ (Patanjali Palm Oil Processing Plant) నిర్మాణ పనులను వేగవంతం చేసి వచ్చే సంక్రాంతి నాటికి అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ (Nalgonda Collector) బి. చంద్రశేఖర్ (Chandrashekar) అధికారులను ఆదేశించారు. గురువారం అనుముల మండలం యాచారం గ్రామంలో 39 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణంలో ఉన్న పతంజలి పామ్ ఆయిల్ ప్రాసెసింగ్ యూనిట్‌ను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. యంత్రాల అమరిక, మౌలిక సదుపాయాలు, విద్యుత్ కనెక్షన్, ప్రాసెసింగ్ విభాగాలు, పార్కింగ్, ప్రధాన ప్రవేశ ద్వారం పనుల పురోగతిపై కంపెనీ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. రైతులు పండించిన పామ్ గెలలను స్థానికంగానే ప్రాసెస్ చేసే అవకాశం కల్పించడం ద్వారా రవాణా ఖర్చులు తగ్గడంతో పాటు తాజా పంటకు మంచి ధర లభిస్తుందని చెప్పారు. ఈ ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభమైతే స్థానిక యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని తెలిపారు.
పరిశ్రమ నిర్మాణానికి అవసరమైన యంత్రాలలో 90 శాతానికి పైగా ఇప్పటికే సైట్‌కు చేరుకున్నాయని, సివిల్ పనులు వేగంగా కొనసాగుతున్నాయని పతంజలి ప్రతినిధులు కలెక్టర్‌కు వివరించారు. హైటెన్షన్ విద్యుత్ కనెక్షన్ పనులు కూడా పురోగతిలో ఉన్నాయని, నిర్ణీత గడువు ప్రకారం వచ్చే సంక్రాంతి నాటికి యూనిట్‌ను ప్రారంభించేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ పరిశీలనలో జిల్లా ఉద్యాన శాఖ అధికారి టి. శేఖర్, జిల్లా వ్యవసాయ అధికారి వినోద్ కుమార్, శాస్త్రవేత్త రాములమ్మ, పతంజలి ప్రతినిధులు సంగని కుమార్, బి. యాదగిరి, బొబ్బిలి వినాయకతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

