కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా పోరాడాలి: నెల్లికంటి సత్యం

కలం, నల్లగొండ : ఆర్టీసీ కార్మికుల హక్కుల సాధన కోసం నిరంతరం పోరాటాలు నిర్వహిస్తున్న ఎంప్లాయిస్ యూనియన్ (ఈయూ, ఎన్ఎంయూ, టీఎంయూ) కూటమిని(Employees Union Alliance) భారీ మెజారిటీతో గెలిపించిన ఆర్టీసీ కార్మికులకు సిపిఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం (Nellikanti Satyam) హృదయపూర్వక అభినందనలు తెలిపారు. కార్మికుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం మొదటి నుంచీ ముందుంటున్న ఈ కూటమిపై కార్మికులు మరోసారి తమ అపారమైన విశ్వాసాన్ని చాటుకున్నారని ప్రశంసించారు.

ఎంప్లాయిస్ యూనియన్ కూటమిని ఓడించే లక్ష్యంతో అధికార కాంగ్రెస్ పార్టీ కొన్ని అద్దె సంఘాలకు తెరవెనుక పూర్తి మద్దతు ఇచ్చి తీవ్ర ప్రయత్నాలు చేసిందని నెల్లికంటి సత్యం ఆరోపించారు. అయినప్పటికీ, కార్మికులు వాటిని తిప్పికొట్టి తమ ఓటు హక్కు ద్వారా సరైన సమాధానం చెప్పారన్నారు. కార్మికుల సమస్యలను పరిష్కరించే సమర్థవంతమైన నాయకత్వానికే ఎప్పుడూ కార్మికుల మద్దతు ఉంటుందని ఈ ఎన్నికల ఫలితాలు మరోసారి రుజువు చేశాయని పేర్కొన్నారు.

ఆర్టీసీ కార్మికుల ఉద్యోగ భద్రత, మెరుగైన వేతనాలు, సముచిత పని పరిస్థితుల సాధన కోసం ఎంప్లాయిస్ యూనియన్ కూటమి గతంలో అనేక చారిత్రక పోరాటాలు నిర్వహించిందని ఎమ్మెల్సీ గుర్తుచేశారు. ఈ ఘన విజయం ద్వారా కూటమిపై మరింత బాధ్యత పెరిగిందని, భవిష్యత్తులోనూ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం మరింత ఐక్యతతో పోరాడాలని సూచించారు. కూటమి విజయం కోసం శ్రమించిన ప్రతి ఒక్క కార్మికుడికి, నాయకుడికి మరోసారి అభినందనలు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>