నల్లగొండ కలెక్టరేట్‌ ఎదుట కాంగ్రెస్‌ మహా ధర్నా.. జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మ దహనం

కలం, నల్లగొండ: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ చేతిలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ కీలుబొమ్మలా మారారని, ఓటర్ల జాబితా సవరణలో జరుగుతున్న అక్రమాలకు నిరసనగా ఆయన తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ (Nenavath Balu Naik) డిమాండ్ చేశారు.

‘ఓటు చోరీ’ ఆరోపణలు, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో చోటుచేసుకుంటున్న పొరపాట్లకు నిరసనగా టీపీసీసీ అధ్యక్షుడు బి.మహేష్‌కుమార్ గౌడ్ పిలుపు మేరకు సోమవారం నల్లగొండ (Nalgonda) కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ధర్నా (Congress Protest) నిర్వహించారు. నల్లగొండ డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాస్ నేత అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రతీ పౌరుడి ప్రాథమిక హక్కు అని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరి ఓటు సురక్షితంగా ఉండేలా ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా సాగాలని అన్నారు. ఓటర్ల జాబితా సవరణపై కాంగ్రెస్ పార్టీ లేవనెత్తుతున్న అభ్యంతరాలు, ప్రశ్నలకు ఎన్నికల సంఘం స్పష్టమైన సమాధానాలు చెప్పాలని నిలదీశారు.

SIR ప్రక్రియ, కొత్త ఓటర్ల నమోదు, ఓటర్ల తొలగింపు అంశాలపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయని ఎమ్మెల్యే బాలు నాయక్ పేర్కొన్నారు. ఓటర్ల జాబితా నుంచి ఎవరి పేర్లు తొలగించారు, దానికి పాటించిన నిబంధనలు ఏంటి అనే విషయాలపై పారదర్శకత లోపించిందన్నారు. ఎన్నికల సంఘంలోని కమిషనర్లు కూడా కొన్ని అంశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు వార్తలు రావడం చూస్తుంటే వ్యవస్థ ఎంత దారుణంగా తయారైందో అర్థమవుతోందన్నారు.

‘ఓటు చోరీ’ ఆరోపణలపై సమగ్ర, స్వతంత్ర విచారణ జరిపి ప్రజలకు పూర్తి వివరాలు వెల్లడించాల్సిన బాధ్యత ఈసీపై ఉందన్నారు. ధర్నా అనంతరం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కలెక్టరేట్ ఆవరణలో కేంద్ర ఎన్నికల సంఘం, సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా తీవ్రస్థాయిలో నినాదాలు చేశారు. అనంతరం సీఈసీ దిష్టిబొమ్మను దహనం చేశారు.

జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న పోరాటంలో భాగంగానే జిల్లా కేంద్రంలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టినట్లు నాయకులు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యవర్గ సభ్యులు, వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు, యువజన కాంగ్రెస్‌ ప్రతినిధులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>