కలం, రామన్నపేట: ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా అధికారులు పనిచేయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికీ అందేలా సమన్వయంతో ముందుకు సాగాలని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం (MLA Vemula Veeresham) సూచించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట (Ramannapet) మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన మండల స్థాయి సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మండలంలోని వివిధ శాఖల అధికారులతో అభివృద్ధి పనుల పురోగతి, సంక్షేమ పథకాల అమలు, ప్రజలకు అందుతున్న సేవలపై సమగ్రంగా సమీక్షించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై అధికారులు తక్షణమే స్పందించి పరిష్కారం చూపాలని ఆదేశించారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలకు మరింత చేరువ చేయాలని, అర్జీలకు ప్రాధాన్యతనిస్తూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. మండలంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పనుల్లో అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. సమావేశంలో వివిధ గ్రామాల సర్పంచ్లు, మండల స్థాయి అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

