కలం, నాగర్ కర్నూల్ : జవహర్ నవోదయ కేంద్రీయ విద్యాలయంలో వచ్చే ఏడాది ఆరవ తరగతిలో ప్రవేశం (Navodaya Exam Preparations) కోసం ఈనెల 28న నిర్వహించే ప్రవేశ పరీక్షను జాగ్రత్తగా నిర్వహించాలని నాగర్ కర్నూల్ విద్యాశాఖ అసిస్టెంట్ కమిషనర్ రాజశేఖర్ రావు అన్నారు. 2027-2028 విద్యా సంవత్సరం 6వ తరగతిలో ప్రవేశానికి సంబంధించి గురువారం నాడు వివిధ నవోదయ పరీక్ష కేంద్రాల సెంటర్ సూపెంటెండెంట్ లు, కేంద్ర స్థాయి పరిశీలకుల శిక్షణా శిబిరం వట్టెం జవహర్ నవోదయ విద్యాలయ ప్రిన్సిపాల్ బి.పూర్ణిమ అధ్యక్షతన జరిగింది.
ఈ సమావేశంలో అసిస్టెంట్ కమిషనర్ ప్రసంగిస్తూ నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాలకు కలిపి నిర్వహించే ఈ నవోదయ పరీక్షను ప్రతిష్టాత్మకంగా తీసుకొని విజయవంతంగా నిర్వహించాలని అన్నారు. ఈ సందర్భంగా విద్యాలయ ప్రిన్సిపాల్ బి . పూర్ణిమ మాట్లాడుతూ.. మూడు జిల్లాల వ్యాప్తంగా 18 కేంద్రాలలో నిర్వహించే ఈ ప్రవేశ పరీక్ష నిర్వాహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, సిఎస్‌లు, సిఎల్ఓలు అన్ని జాగ్రత్తలతో పరీక్షను పారదర్శకంగా నిర్వహించాలన్నారు. పరీక్ష నిర్వహణ విధులను వివరించారు.
అత్యంత పోటీతో హాజరవుతున్న పరీక్షార్థుల కు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా పరీక్షా కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు చేయాలని, పరీక్ష నిర్వహణలో ఏ చిన్న పొరపాటు లేకుండా శ్రద్ధ తీసుకోవాలన్నారు. వైస్ ప్రిన్సిపాల్ సుధారాణి మాట్లాడుతూ.. వట్టెం నవోదయ విద్యాలయ ప్రాధాన్యతను, ప్రతిభావంతులైన పౌరులను అందించడంలో ఈ విద్యాలయ పాత్రను వివరిస్తూ, పరీక్ష రోజు వివిధ జిల్లాలలో నియమితులైన వివిధ రూట్ అధికారులను పరిచయం చేశారు. ఈ శిక్షణా కార్యక్రమంలో 18 కేంద్రాల సిఎస్‌లు , సిఎల్ ఓలు, నవోదయ సిబ్బంది పాల్గొన్నారు.
18 పరీక్షా కేంద్రాల్లో 4284 మంది విద్యార్థులు
ఈనెల 28 వ తేదీ ( శనివారం) నిర్వహించే నవోదయ అర్హత పరీక్ష కు 18 పరీక్ష కేంద్రాల్లో 4284 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. ఆరోజు ఉదయం11.30 నుండి మధ్యాహ్నం 1.30 వరకు నిర్వహించబడుతుందని నిర్వాహకులు తెలిపారు. నాగర్ కర్నూల్ జిల్లా లో10 కేంద్రాలలో 2214 మంది, జోగులాంబ గద్వాల జిల్లా లో నాలుగు పరీక్ష కేంద్రాలలో1002 మంది,వనపర్తి జిల్లా లో నాలుగు పరీక్ష కేంద్రాల్లో 1068మంది, మొత్తం 4284 మందిలో663 మంది తెలుగు మీడియంలో 3621మంది ఇంగ్లీష్ భాషలలో పరీక్ష వ్రాయబోతున్నారు. వివిధ జిల్లాల కలెక్టర్ల ఆదేశాలతో జిల్లా పోలీసు అధికారులు బందోబస్తు, వైద్యాధికారులు వైద్య సదుపాయాలు, రెవెన్యూ అధికారులు తనిఖీ ఏర్పాట్లు చేశారు.

