Mobile Popup Ad
Mobile Popup Ad

ముస్లిం మహిళలు మసీదుల్లోకి వెళ్లొచ్చు!

కలం, వెబ్​ డెస్క్​ : మసీదుల్లోకి ముస్లిం మహిళల ప్రవేశంపై ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ (All India Muslim Personal Law Board) సుప్రీంకోర్టులో తన స్పష్టమైన వైఖరి తెలియజేసింది. శబరిమల తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్లను విచారిస్తున్న 9 మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ముందు బోర్డు తరఫు న్యాయవాది ఎంఆర్. షంషాద్ కీలక వాదనలు వినిపించారు. ఇస్లాం నిబంధనల ప్రకారం మహిళలు మసీదులోకి ప్రవేశించి నమాజ్ చేయడానికి ఎటువంటి నిషేధం లేదని బోర్డు స్పష్టం చేసింది. ‘‘మహిళలు మసీదులకు రాకుండా అడ్డుకోవద్దు”అని ప్రవక్త స్వయంగా చెప్పారని, అన్ని ఇస్లాం శాఖల్లోనూ దీనిపై ఏకాభిప్రాయం ఉందని కోర్టుకు తెలిపారు. మహిళలు మసీదుల్లో జరిగే సామూహిక ప్రార్థనల్లో (జమాత్) కూడా పాల్గొనవచ్చని పేర్కొన్నారు. మహిళలు మసీదులోకి ప్రవేశించవచ్చని చెప్తూనే.. కొన్ని నియమాలు పాటించాలని బోర్డు సూచించింది. ముఖ్యంగా, పురుషులు వెళ్లే మెయిన్ డోర్ నుంచే తాము కూడా లోపలికి వెళ్తామని పట్టుబట్టకూడదని బోర్డు (All India Muslim Personal Law Board) తన అఫిడవిట్‌లో పేర్కొంది.

ప్రత్యేక ద్వారాల ద్వారానే..

మసీదుల అంతర్గత ఏర్పాట్ల ప్రకారం.. మహిళల కోసం కేటాయించిన ప్రత్యేక ద్వారాలు లేదా మార్గాల ద్వారానే వారు లోపలికి వెళ్లాలని బోర్డు సూచించింది. మహిళలు ఇంట్లో నమాజ్ చేసుకున్నా, మసీదుకు వెళ్లి చేసినంత పుణ్యం (సవాబ్) లభిస్తుందని పేర్కొంది. ‘‘ఇంట్లో అందరూ మసీదుకు వెళ్తే పిల్లలను ఎవరు చూసుకుంటారు?’’ అనే ఉద్దేశంతోనే మహిళలకు ఇంట్లో ప్రార్థన చేసుకునే వెసులుబాటు కల్పించారని ఈ సందర్భంగా జస్టిస్ అమానుల్లా వ్యాఖ్యానించారు.

కలిసి నమాజ్కు అనుమతించని ఇస్లాం..

మసీదుల్లో పురుషులు, మహిళలు కలిసి నమాజ్ చేయడానికి ఇస్లాం అనుమతించదని, అందుకే వారి మధ్య పరదాలు లేదా ప్రత్యేక గదులు ఉంటాయని బోర్డు తెలిపింది. వీటిని తొలగించాలని మహిళలు కోరకూడదని, మసీదు యాజమాన్యం నిర్ణయించిన నిబంధనలకు కట్టుబడి ఉండాలని స్పష్టం చేసింది. కాగా, పూణేకు చెందిన ఒక మహిళ 2020లో మసీదుల్లోకి మహిళల ప్రవేశంపై ఉన్న వివక్షను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. ముస్లిం లా బోర్డు అభిప్రాయాన్ని కోరగా.. బోర్డు ఈ మేరకు తన వివరణను సమర్పించింది. కోర్టులో ఈ అంశంపై ఇంకా తుది తీర్పు వెలువడాల్సి ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>