కలం, స్పోర్ట్స్ : ఐపీఎల్ 2026 (IPL) సీజన్‌లో వరుస ఓటములతో సతమతమవుతున్న ముంబై ఇండియన్స్ కథ దాదాపు ముగిసినట్లేనని మాజీ క్రికెటర్ మురళీ కార్తీక్ (Murali Kartik) అభిప్రాయపడ్డారు. శనివారం చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) చేతిలో 8 వికెట్ల తేడాతో ఓడిపోవడంతో, ముంబై ప్లేఆఫ్స్ అవకాశాలు 99 శాతం ఆవిరయ్యాయని ఆయన పేర్కొన్నారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హార్దిక్ పాండ్యా సేన, నిర్ణీత ఓవర్లలో కేవలం 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. మంచి ఆరంభం లభించినప్పటికీ, ఇన్నింగ్స్ మధ్యలో తడబడటంతో భారీ స్కోరు సాధించలేకపోయింది. బౌలింగ్‌లోనూ చెన్నై బ్యాటర్లను ఏమాత్రం నిలువరించలేకపోయిన ముంబై, ఈ సీజన్‌లో రెండోసారి ఆ జట్టు చేతిలో ఓటమిని చవిచూసింది.
ముంబై ఆటతీరును విశ్లేషిస్తూ కార్తీక్ (Murali Kartik) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జట్టులో ఒకరికి ఫామ్ లేకపోతే అది మిగిలిన వారందరికీ అంటువ్యాధిలా (పాండమిక్) వ్యాపిస్తోందని ఆయన అన్నారు. ఒకరు ఆవలిస్తే పక్కన వారు కూడా ఆవలిస్తారని, ముంబై పరిస్థితి కూడా అలాగే ఉందని ఎద్దేవా చేశారు. ఇందుకు ఉదాహరణగా సాన్జూ శాంసన్ ఇచ్చిన క్యాచ్‌ను విల్ జాక్స్ వదిలేయడాన్ని ఆయన గుర్తు చేశారు. గత మ్యాచ్‌లలో నమన్ ధీర్ కూడా ఇదే తరహాలో క్యాచ్‌లు వదిలేసి ప్రత్యర్థులకు అవకాశాలు ఇచ్చారని పేర్కొన్నారు.
ముంబై ఇండియన్స్ (MI) సాధారణంగా లీగ్ రెండో సగంలో పుంజుకుంటుందని పేరుంది. కానీ ఈసారి తొమ్మిదో స్థానంలో ఉన్న ఆ జట్టులో అలాంటి ఆశలేమీ కనిపించడం లేదని కార్తీక్ స్పష్టం చేశారు. ఇప్పటికే అనేక ప్రయోగాలు చేసినా అవేవీ ఫలితమివ్వడం లేదని, ఈ సీజన్‌ను ముంబై ఒక పీడకలలా మర్చిపోవాలనుకుంటుందని ఆయన అన్నారు. ప్రస్తుతం 4 పాయింట్లతో ఉన్న ముంబై, ప్లేఆఫ్స్ చేరాలంటే అద్భుతం జరగాల్సిందేనని ఆయన అభిప్రాయపడ్డారు.
Read Also: భారీ ధరకు అమ్ముడైన అర్జున్ టెండూల్కర్!
Follow Us On: WhatsApp

