కలం, వెబ్‌డెస్క్: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ (Arjun Tendulkar) వార్తల్లో నిలిచారు. ఐపీఎల్ 2026 (IPL 2026) సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఇంకా మైదానంలోకి అడుగుపెట్టని అర్జున్, శనివారం జరిగిన టీ20 ముంబై లీగ్ వేలంలో భారీ ధర పలికారు. ఏకంగా రూ.10 లక్షలు వెచ్చించి ఏఆర్‌సీఎస్ (ARCS) అంధేరీ జట్టు అతడిని సొంతం చేసుకుంది. ఇది అతడి కనీస ధర రూ.2 లక్షల కంటే ఐదు రెట్లు ఎక్కువ కావడం విశేషం. నిజానికి గత కొన్ని సీజన్లుగా అర్జున్ ముంబైని వదిలి గోవా తరపున దేశవాళీ క్రికెట్ ఆడుతున్నారు. అయితే, గత ఏడాది కాలంగా ఆయన ఎలాంటి ఇతర రాష్ట్ర లీగ్‌లలో ఆడకపోవడంతో, టీ20 ముంబై లీగ్‌లో ఆడేందుకు బీసీసీఐ నుంచి అనుమతి లభించింది.
ఆటగాళ్లు అతిగా శ్రమించకుండా ఉండేందుకు, ఐపీఎల్ మినహా ఏడాదికి ఒక అధికారిక స్టేట్ లీగ్ మాత్రమే ఆడాలనే నిబంధనను బీసీసీఐ (BCCI) అమలు చేస్తోంది. ఈ నిబంధనల ప్రకారం అర్జున్ ఈ లీగ్ ఆడేందుకు అర్హత సాధించారు. ప్రస్తుతం లక్నో సూపర్ జెయింట్స్ జట్టులో ఉన్న అర్జున్, అక్కడ సీనియర్ ఆటగాళ్లు, కోచింగ్ స్టాఫ్ పర్యవేక్షణలో తన నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటున్నారు. నెట్స్‌లో ఆయన కనబరుస్తున్న ప్రదర్శన చూస్తుంటే ఐపీఎల్ ఒత్తిడిని తట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఐపీఎల్‌లో అవకాశం కోసం ఎదురుచూస్తున్న తరుణంలో, టీ20 ముంబై లీగ్‌లో అరంగేట్రం చేసే అవకాశం రావడం అర్జున్ (Arjun Tendulkar) కెరీర్‌కు కీలకంగా మారనుంది.
Read Also: చిన్నారుల కోసం రంగంలోకి వాయుసేన.. అసలేమైందంటే?
Follow Us On: WhatsApp

