కలం, నల్లగొండ బ్యూరో: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు (Yadadri Trust Board) నియామకాలపై మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Raj Gopal Reddy) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ట్రస్ట్ బోర్డు నియామకాల విషయంలో తమలాంటి సీనియర్ నాయకులకు కనీస సమాచారం కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను మాజీ భువనగిరి ఎంపీని, మునుగోడు నియోజకవర్గం యాదాద్రి జిల్లాలోనే ఉన్నప్పటికీ నియామకాలపై సమాచారం ఇవ్వకపోవడం సరికాదని అన్నారు. ముందుగా తెలియజేసి ఉంటే తమ నియోజకవర్గం నుంచి ఒక సభ్యుడి పేరును ప్రతిపాదించే అవకాశముండేదని చెప్పారు. ఇలాంటి ఏకపక్ష నిర్ణయాలతో ముందుకు సాగడం కష్టమని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం ఒరిజినల్ నాయకులకు తగిన ప్రాధాన్యం దక్కడం లేదని రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ కోసం పోరాడిన సీనియర్ కాంగ్రెస్ నేతలను పక్కనబెట్టి, కొత్తగా పార్టీలో చేరిన వారికే ఎక్కువ అవకాశాలు కల్పిస్తున్నారని ఆరోపించారు. నియామకాల విషయంలో సీనియర్ నాయకుల అభిప్రాయాలకు విలువ ఇవ్వడం లేదని అన్నారు. ముఖ్యమంత్రి వ్యవహారశైలిపైనా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయాలని, కేవలం హంగామాలు, షోలకు పరిమితం కాకూడదని సూచించారు. సీఎం పని తీరుపై అసంతృప్తి కారణంగానే ఇటీవల నల్లగొండలో జరిగిన ముఖ్యమంత్రి సమావేశానికి తాను హాజరుకాలేదని వెల్లడించారు. తన సోదరుడు, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తనను “దానకర్ణుడు”గా పేర్కొన్న వ్యాఖ్యలపై స్పందిస్తూ, ఆ మాటలను ఆయన సానుకూల ఉద్దేశంతోనే చెప్పారని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. యాదాద్రి ట్రస్ట్ బోర్డు నియామకాల అంశంపై రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలపై మరోసారి చర్చకు దారితీశాయి.

