epaper
Sunday, February 22, 2026
epaper

మునుగోడులో వివాదాస్పదంగా రాజగోపాల్ రెడ్డి రూల్స్

కలం, నల్లగొండ బ్యూరో : మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) రూటే సపరేటు. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఓ సంచలనం. ఎప్పుడు ఎలాంటి కామెంట్స్ చేస్తారో.. నియోజకవర్గంలో ఏం ఆంక్షలు తీసుకొస్తారో.. తెలియని పరిస్థితి. నియోజకవర్గంలోనే కాదు, రాష్ట్ర రాజకీయాల్లోనూ రాజగోపాల్ రెడ్డి తీరు రోజురోజుకీ వివాదస్పదంగా మారుతోంది. నిజానికి తెలంగాణ రాజకీయాల్లో కోమటిరెడ్డి బ్రదర్స్ స్టైలే వేరు. అందులోనూ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఆయన వ్యవహారశైలి కాంగ్రెస్ అధిష్టానానికి, రాష్ట్ర ప్రభుత్వానికి కొరకరాని కొయ్యగా మారింది. నియోజకవర్గంలో సొంత నిబంధనలు అమలు చేయడం నుంచి మొదలుకొని, ఏకంగా ముఖ్యమంత్రి పదవిపై కన్నేయడం వరకు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

కాంగ్రెస్ అధిష్టానంపైనే తిరుగుబాటు..

రాజగోపాల్ రెడ్డి (Rajagopal Reddy) రోజుకో వివాదంతో ఇటు పార్టీకి.. అటు ప్రభుత్వానికి తలనొప్పిగా మారారు. ఈ క్రమంలోనే నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసురుతుండడం గమనార్హం. గతంలోనూ పలుమార్లు తాను సీనియర్ నని, తనకంటే జూనియర్లకు పదవులు ఇచ్చారని బహిరంగంగానే అసంతృప్తి వెళ్లగక్కారు. ఆయన వ్యవహారశైలి కాంగ్రెస్ ముఖ్య నేతలకు మింగుడు పడినప్పటికీ యాక్షన్ తీసుకోవడానికి వెనకడుగు వేస్తున్నట్లు కనిపిస్తోంది.

పార్టీ లైన్ దాటి మాట్లాడుతున్నా, నియోజకవర్గంలో ఆయనకున్న పట్టు దృష్ట్యా అధిష్టానం ఆచితూచి అడుగులేస్తున్నట్టు సమాచారం. మునుగోడులో నా రూటే సపరేటు అనే తరహాలో వ్యవహరిస్తున్నా.. పార్టీ గానీ అధిష్టానం గానీ స్పందించడం లేదు. ఇదిలావుంటే.. తరచూ ప్రభుత్వంపై వివాదస్పద వ్యాఖ్యలు చేయడం.. సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ గా కామెంట్స్ చేస్తేనే.. పార్టీ అధిష్టానం పిలిచి మంత్రి పదవి ఇస్తుందనే యోచనలో ఇలా ప్రవర్తిస్తున్నారా..? లేక కాంగ్రెస్ పార్టీనే రాజగోపాల్ రెడ్డిని లైట్ తీసుకుందా..? అన్న చర్చ లేకపోలేదు.

వైన్స్ నిర్వాహకులపై ఆంక్షలు

తెలంగాణలో ఎక్కడా లేని విధంగా మునుగోడు నియోజకవర్గంలో రాజగోపాల్ రెడ్డి సొంతంగా మద్యం దుకాణాలపై ఆంక్షలు విధించారు. బెల్ట్ షాపులు ఉండకూడదని, నిర్ణీత ధరలకే అమ్మాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. వైన్ షాపులు దక్కించుకున్న వారు ఊరికి చివర్లో మద్యం దుకాణాలు ఏర్పాటు చేయాలని.. అలానే ఉదయం నుంచే వైన్స్ తెరవద్దని.. మధ్యాహ్నం 1 గంట తర్వాతే మద్యం అమ్మకాలు ప్రారంభించాలని వైన్స్ దుకాణాలకు దరఖాస్తుల సమయంలోనే సూచించారు. పర్మిట్ రూముల్లోనికి సాయంత్రం 6 గంటల తర్వాతే అనుమతించాలని ఆదేశించారు. దీంతో అప్పట్లో రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై దుమారం రేగింది. వైన్స్ నిర్వాహకులు టీపీసీసీ చీఫ్‌తో పాటు ప్రభుత్వ పెద్దలను కలిశారు. వారిచ్చిన భరోసాతోనే వైన్స్ దుకాణాలకు టెండర్లు వేశారు.

కానీ క్షేత్రస్థాయిలో మాత్రం రాజగోపాల్ రెడ్డి తన పంతం నెగ్గించుకుంటున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఆంక్షలు పాటించాల్సిందే. లేకుంటే ఎమ్మెల్యే అనుచరులు వైన్స్ నిర్వాహకులపై భౌతిక దాడులకు దిగిన ఘటనలు లేకపోలేదు. ఇదిలావుంటే.. ఓవైపు ప్రభుత్వం ఎక్సైజ్ ఆదాయంపై దృష్టి పెడుతుంటే.. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే సొంతంగా సమాంతర వ్యవస్థను నడపడంపై అధికార యంత్రాంగం అయోమయంలో పడింది. ఈ వ్యవహారం సొంత పార్టీ ఎమ్మెల్యేల నుంచి అసంతృప్తి విన్పిస్తోంది. తెలంగాణ మొత్తంలో ఒకటే రూల్ ఉండాలి గానీ ఇలా వ్యవహరించడం ఏంటి అంటూ బహిరంగంగానే విమర్శిస్తుండడం గమనార్హం.

మంత్రి పదవే టార్గెట్..?

కోమటిరెడ్డి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడు నుంచి పోటీ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే అప్పటి పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి.. ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఉపఎన్నికలో బీజేపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. దీంతో 2023 ఎన్నికల నాటికి కాంగ్రెస్‌లో మళ్లీ చేరి మునుగోడు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే తనకు అధిష్టానం మంత్రి పదవి ఇస్తానని హామీ ఇస్తేనే.. కాంగ్రెస్ పార్టీలో చేరారని, ఇప్పుడు ఇవ్వకపోవడంపై తరచూ రాజగోపాల్ రెడ్డి నిరసన గళం విప్పుతున్నారు.

ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించాయి. తనకు మంత్రి పదవి ఇవ్వడంలో జరుగుతున్న ఆలస్యంపై ఆయన అసహనం వ్యక్తం చేస్తూ మంత్రి పదవి ఇస్తే ఇవ్వండి.. లేకుంటే నేరుగా ముఖ్యమంత్రి పదవిలోనే కూర్చుంటానంటూ వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది. మొత్తానికి రాజగోపాల్ రెడ్డి తీరు ‘ప్రభుత్వంలో ఉంటూనే ప్రతిపక్ష పాత్ర’ పోషిస్తున్నట్లుగా ఉంది. తన వర్గాన్ని కాపాడుకోవడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలు కాంగ్రెస్ కోటలో చిచ్చు పెడుతుందా.. లేక అధిష్టానం పిలిచి పదవి ఇస్తుందా..? అన్నది వేచి చూడాల్సిందే.

Read Also: బీజేపీ వారసత్వం ఉన్న వారే గాంధీని చంపేశారు : సీఎం రేవంత్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>