Mobile Popup Ad
Mobile Popup Ad

నిర్మల్‌లో పశువుల సమస్యకు యాక్షన్ ప్లాన్

కలం, నిర్మల్ : నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారులపై పశువుల సంచారం వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. రోడ్లపై మందలుగా తిరుగుతున్న ఆవులు, గేదెల కారణంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తడంతో పాటు ప్రమాదాల ముప్పు పెరుగుతోంది. బైల్‌బజార్, తిరుమల టాకీస్, బస్టాండ్, జయశంకర్ చౌరస్తా, ఆర్డీఓ కార్యాలయం, బస్ డిపో, శివాజీ చౌక్, శాస్త్రినగర్ కాలనీ తదితర ప్రాంతాలలో పశువులు రోడ్లపైనే సంచరిస్తుండటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. రద్దీ సమయాలలో వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.

ముఖ్యంగా రాత్రి వేళల్లో రోడ్లపై పడుకునే పశువులు ప్రమాదాలకు కారణమవుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. చీకటిలో పశువులు కనిపించక ద్విచక్ర వాహనదారులు వాటిని ఢీకొని గాయపడిన ఘటనలు చోటుచేసుకున్నాయని పేర్కొంటున్నారు. పశువుల యజమానులు వాటిని రోడ్లపై వదిలేయకుండా తమ సొంత స్థలాలలో ఉంచాలని ప్రజలు కోరుతున్నారు. రోడ్లపై పశువుల సంచారం కొనసాగితే పెద్ద ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గత నెల 25న పశువులను రోడ్లపై వదలవద్దని, వాటిని సొంత స్థలాలకు తరలించాలని బల్దియా అధికారులు ప్రకటన జారీ చేశారు. అయితే ఆ ప్రకటనకు ఆశించిన స్థాయిలో స్పందన రాలేదని స్థానికులు చెబుతున్నారు. సమస్య పరిష్కారానికి మున్సిపల్ అధికారులు కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.

ప్రత్యేక డ్రైవ్ చేపడతాం: కమిషనర్ రవిబాబు

నిర్మల్ మున్సిపల్ పరిధిలో రోడ్లపై స్వేచ్ఛగా సంచరిస్తున్న పశువుల నియంత్రణకు ప్రత్యేక డ్రైవ్ చేపడతామని మున్సిపల్ కమిషనర్ (Municipal Commissioner) రవిబాబు తెలిపారు. రోడ్లపై తిరుగుతున్న గోవులు, ఎద్దులను వాటి యజమానులు వెంటనే తమ సొంత స్థలాలకు తరలించుకోవాలని ఇప్పటికే పలుమార్లు సూచించినట్లు తెలిపారు. అయినప్పటికీ స్పందించకపోతే మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకుని రోడ్లపై సంచరిస్తున్న పశువులను గోశాలలకు తరలిస్తామని వెల్లడించారు. ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు, ప్రమాదాల నుంచి ఉపశమనం కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపడతామని కమిషనర్ స్పష్టం చేశారు.

Read Also: ల్యాట్ రిలేషన్ షిప్స్ 

Read Also : తుంగతుర్తి కాంగ్రెస్‌ ఫైట్.. ఎంపీ చామల కీలక వ్యాఖ్యలు!

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>