కలం, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri Kothagudem) జిల్లాలోని గురుకులాల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. వారం వ్యవధిలో రెండు వేరు వేరు ప్రాంతాల్లోని గురుకుల పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ జరగడంతో జిల్లా వ్యాప్తంగా గురుకులాల్లో చదివే పిల్లల తల్లి దండ్రులు ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా చికెన్ లేదా మటన్ తిన్నప్పుడు ఈ ఘటనలు చోటు చేసుకుంటున్నాయని బాధితుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
గత ఆదివారం మణుగూరు (Manuguru) మండల కేంద్రంలోనీ జ్యోతి బా పూలే బాలికల గురుకులంలో మటన్ తిన్న వెంటనే 17 మంది బాలికలు అస్వస్థతకు గురికావడంతో వారిని మణుగూరు 100 పడకల ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. స్థానిక ఎమ్మెల్యేతో పాటు జిల్లా వైద్యాధికారులు ఆసుపత్రిని సందర్శించి బాధితులను పరామర్శించడం జరిగింది. జిల్లా కలెక్టర్ అంకిత్ (Ankit) కూడా ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటు చేసుకోకుండా అధికారులతో సమీక్షలు నిర్వహించారు. స్వయంగా కొన్ని పాఠశాలలను సందర్శించి వారికి అందుతున్న మెనూను పరిశీలించారు. పాఠశాల మెస్, స్టోర్ రూమ్, డైనింగ్ హాల్‌లను పరిశీలించి విద్యార్థులకు అందిస్తున్న బియ్యం, కూరగాయలు, ఇతర సరుకుల నాణ్యతను తనిఖీ చేయడం జరిగింది. అలాగే పాఠశాలల దగ్గర ఉండే చిరుతిళ్ళ దుకాణాలను అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేయాలని ఆదేశాలు కూడా జారీచేయడం జరిగింది.
మంత్రి ఇలఖాలో ఫుడ్ పాయిజన్
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) సొంత గ్రామం అయిన దమ్మ పేట మండలం గండుగులపల్లిలోని ఏకలవ్య రెసిడెన్షియల్ స్కూల్లో 27 మంది విద్యార్థులు గురువారం అర్ధరాత్రి అస్వస్థతకు గురయ్యారు. వారిని పాఠశాల యాజమాన్యం ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. మధ్యాహ్నం చికెన్‌తో భోజనం చేయడం వల్లనే వాంతులు, కడుపునొప్పి వచ్చిందని బాధిత విద్యార్థులు చెప్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ (Jare Adinarayana) శుక్రవారం విద్యార్ధులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

