కలం, తానూర్ : తానూర్ మండలంలోని (Tanoor Mandal) పంజాబ్ ల్యాండ్స్ 22-ఏ నిషేధిత జాబితాలో ఉన్న భూముల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ముథోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ (Pawar Ramarao Patel) తెలిపారు. మండలంలోని కోలూరు, హంగిర్గ, హిప్నేల్లి గ్రామాల్లో నిర్వహించిన గ్రామసభల్లో ఆయన పాల్గొన్నారు. భూ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న పట్టాదారులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అర్హులైన రైతులకు న్యాయం జరిగేలా సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటామని భరోసా ఇచ్చారు.
ఇటీవల జిల్లా కలెక్టరేట్‌లో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నిర్వహించిన సమీక్ష సమావేశంలో తానూర్ మండలంలోని సుమారు 2,500 ఎకరాల భూములకు సంబంధించిన సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు ఎమ్మెల్యే తెలిపారు. భూములకు సంబంధించిన రెవెన్యూ రికార్డులను పరిశీలించి, ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన పట్టాదారులకు న్యాయం చేయాలని అధికారులను కోరినట్లు పేర్కొన్నారు. 27వ ప్యాకేజీ కింద చేపట్టే పనులు పూర్తయితే తానూర్ మండలంలోని గ్రామాలకు, వ్యవసాయ రంగానికి ప్రయోజనం చేకూరుతుందని ఎమ్మెల్యే అన్నారు. రైతులు తమ పొలాలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడకుండా వి.బి.జి. రామ్‌జీ పథకం కింద వ్యవసాయ రహదారుల అభివృద్ధికి కృషి చేస్తామని వెల్లడించారు.

