కలం, స్పోర్ట్స్: ఐపీఎల్ 2026లో ధోనీ (MS Dhoni) రీఎంట్రీ ఇవ్వనున్నారు. గాయం కారణంగా పలు మ్యాచ్‌లకు దూరంగా ఉన్న కెప్టెన్ కూల్.. ముంబైతో వాంఖడేలో జరగనున్న పోరుతో మళ్ళీ మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు. ఈ క్రమంలోనే ప్లేయింగ్ 11ను ఫైనల్ చేయడంలో చెన్నైకి (CSK) తలనొప్పులు మొదలయ్యాయి. ఆయుష్ మాత్రే స్థానంలో ఎవరిని తీసుకోవాలి? ధోనీని ఏ ప్లేస్‌లో దింపాలి? ఇలాంటి అనేక ప్రశ్నలు సీఎస్‌కే సెలక్షన్ కమిటీ ముందు అతిపెద్ద ఛాలెంజెస్‌గా నిలిచాయి. వీటిపై తాజాగా మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జట్టులోకి ఉర్విల్ పటేల్‌ను తీసుకుంటే, ఎంఎస్ ధోనీకి చోటు దక్కడం కష్టమని ఆయన అభిప్రాయపడ్డారు.
గురువారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఈ రెండు జట్లు తలపడనున్నాయి. హ్యామ్‌స్ట్రింగ్ గాయం కారణంగా ఆయుష్ మాత్రే టోర్నీ మొత్తానికి దూరం కావడంతో, చెన్నై తుది జట్టులో మార్పులు తప్పనిసరి అయ్యాయి. దీంతో మాత్రే స్థానాన్ని ఎవరిత భర్తీ చేయాలి? ఆ మార్పు జట్టుపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? అన్న అంశాలపై చోప్రా స్పందించారు. మాత్రే స్థానంలో ఉర్విల్ పటేల్‌ను తీసుకుని, నాలుగో స్థానంలో మాథ్యూ షార్ట్‌ను కొనసాగిస్తే జట్టు సమతుల్యత దెబ్బతింటుందని చోప్రా విశ్లేషించారు.
ఒకవేళ ధోనీని (MS Dhoni) జట్టులోకి తీసుకోవాలంటే మాథ్యూ షార్ట్‌ను మూడో స్థానానికి ప్రమోట్ చేయాల్సి ఉంటుందని ఆయన సూచించారు. అప్పుడు సర్ఫరాజ్ ఖాన్, డెవాల్డ్ బ్రెవిస్, శివం దూబే, జేమీ ఓవర్టన్ వరుసగా తర్వాతి స్థానాల్లో వచ్చి, ధోనీ ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు రావచ్చని పేర్కొన్నారు. అయితే, ఈ సమీకరణలో ఎనిమిదో నంబర్ వరకు కేవలం నలుగురు బౌలర్లు మాత్రమే అందుబాటులో ఉంటారని ఆయన గుర్తు చేశారు.
ఇలాంటి పరిస్థితుల్లో అకేల్ హోసేన్ లేదా స్పెన్సర్ జాన్సన్ వంటి విదేశీ బౌలర్లను పక్కన పెట్టాల్సి వస్తుందని చోప్రా తెలిపారు. అప్పుడు బౌలింగ్ విభాగం బలహీనపడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మరో ప్రత్యామ్నాయంగా స్పెన్సర్ జాన్సన్‌ను జట్టులోకి తీసుకోవడానికి, మాథ్యూ షార్ట్ స్థానంలో ఉర్విల్ పటేల్‌ను ఆడించే అవకాశం కూడా ఉందని ఆయన వివరించారు. ఈ కీలక పోరులో రుతురాజ్ గైక్వాడ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

