కలం, కరీంనగర్ బ్యూరో : తెలంగాణ రాష్ట్ర యువత భవిష్యత్తుతో రాజకీయాలు చేస్తే సహించబోమని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ (MP Gaddam Vamshi Krishna) హెచ్చరించారు. కేటీఆర్ వంటి నాయకుల మాటలు నమ్మి యువత తమ భవిష్యత్తును ప్రమాదంలో పడేసుకోవద్దని ఓ ప్రకటనలో సూచించారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాల విషయంలో తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. తెలంగాణ ప్రజలు ఆ పాలనను దగ్గర నుంచి చూశారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి ఏడాదిలోనే సుమారు 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేసి, పారదర్శకంగా నియామకాలు చేపట్టిందని తెలిపారు.
యువతకు ఉపాధి, నైపుణ్యాభివృద్ధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని, ముఖ్యంగా మంత్రి వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా అమలు అవుతున్నాయని పేర్కొన్నారు. అభివృద్ధి కార్యక్రమాలను స్వాగతించాల్సింది పోయి, బీఆర్ఎస్ నాయకులు ప్రజల్లో అపోహలు సృష్టిస్తూ యువతను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ యువత భవిష్యత్తుతో రాజకీయాలు చేసే వారిని ప్రజలు క్షమించరని పేర్కొన్నారు.

