కలం, వరంగల్ బ్యూరో : విద్యా సంస్థల పరిసరాలలో పొగాకు ఉత్పత్తులు విక్రయిస్తే జైలు శిక్ష తప్పదని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ (CP Sunpreet Singh) హెచ్చరించారు. కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో స్కూళ్లు, కళాశాలల సమీపంలో గుట్కా, సిగరెట్లు తదితర పొగాకు ఉత్పత్తుల విక్రయాలను అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. విద్యార్థులు చెడు అలవాట్లకు బానిసలయ్యే ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వరంగల్ కమిషనరేట్ పరిధిలో ‘ఆపరేషన్ సేఫ్ స్కూల్’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా విద్యాసంస్థల సమీపంలోని పాన్ షాపులు, ఇతర దుకాణాలపై విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. మైనర్లు, విద్యార్థులకు గుట్కా, సిగరెట్లు వంటి పొగాకు ఉత్పత్తులను విక్రయించకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమయ్యే నాటికి స్కూళ్లు, కాలేజీల పరిసరాలను పూర్తిగా టొబాకో ఫ్రీ జోన్లుగా మార్చడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా విద్యాసంస్థల వద్ద పొగాకు ఉత్పత్తుల విక్రయాలను నిషేధిస్తూ రూపొందించిన వాల్ పోస్టర్‌ను సీపీ సన్ ప్రీత్ సింగ్ ఆవిష్కరించారు. విద్యార్థుల భవిష్యత్తును కాపాడాల్సిన బాధ్యత సమాజంలోని ప్రతి ఒక్కరిపైనా ఉందని ఆయన పేర్కొన్నారు. విద్యాసంస్థల వద్ద పొగాకు ఉత్పత్తుల విక్రయాలకు పాల్పడిన వారిపై సిగరెట్ అండ్ అదర్ టొబాకో ప్రొడక్ట్స్ యాక్ట్-2003 ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే మైనర్లకు పొగాకు ఉత్పత్తులు విక్రయిస్తే జువెనైల్ జస్టిస్ యాక్ట్-2015 సెక్షన్ 77 కింద కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
ఎవరైనా విద్యాసంస్థల సమీపంలో పొగాకు ఉత్పత్తులు విక్రయిస్తున్నట్లు గమనిస్తే స్థానిక పోలీసులకు లేదా డయల్-100కు సమాచారం అందించాలని సీపీ కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ జితేందర్ రెడ్డి, సీసీఆర్‌బీ ఏసీపీ డేవిడ్ రాజు, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ సుజాత, ఏఎస్ఐ రాజేందర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

