కలం, వరంగల్ బ్యూరో: వరంగల్, హనుమకొండ, కాజీపేట నగరాల్లో ఆదివారం సాయంత్రం వర్షం (Warangal Rain) దంచికొట్టింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి సాయంత్రం నాలుగు గంటల నుంచి భారీ వర్షం కురిసింది. సుమారు గంటల తరబడి కురిసిన వర్షంతో నగరంలోని ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోగా, కొన్ని చోట్ల డ్రైనేజీలు పొంగిపొర్లాయి. దీంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
మరోవైపు వర్షంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడటంతో నగరవాసులు కొంత ఉపశమనం పొందారు. వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతులు కూడా కొంత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటికే వరి కోతలు చేపట్టి ధాన్యాన్ని కల్లాల్లో ఆరబెట్టుకుంటున్న రైతుల్లో మాత్రం ఆందోళన నెలకొంది. అకస్మాత్తుగా కురిసిన వర్షంతో కల్లాల్లోని ధాన్యం తడిసిపోయే ప్రమాదం ఉండటంతో రైతులు అప్రమత్తమయ్యారు.

