అవమానాలకు అడ్డా బీఆర్ఎస్: ఎంపీ చామల

కలం, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ పార్టీ అవమానాలకు అడ్డా అంటూ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Chamala)  వ్యాఖ్యానించారు. కేటీఆర్ కాంగ్రెస్ పార్టీలో అవమానాలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎందరో సీనియర్ నేతలను ఘోరంగా అవమానించి బయటకు పంపిందని గుర్తు చేశారు. ఆలె నరేంద్ర, గాదె ఇన్నయ్య, ఈటల రాజేందర్, సొంత ఇంట్లో మనిషి కవిత ఇలా ఎందరో అవమానాలకు గురయ్యారని వివరించారు. కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డికి ఎంతో గౌరవం ఇచ్చినా ఆయన పార్టీ మారడం విడ్డూరంగా ఉందన్నారు. జీవన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ ఏం తక్కువ చేసిందని ప్రశ్నించారు. గతంలో తుమ్మల నాగేశ్వర్ రావు ఓడిపోతే పాలేరు నియోజకవర్గం నుంచి కందాల ఉపేందర్ రెడ్డిని చేర్చుకున్న బీఆర్ఎస్ పార్టీ తుమ్మలను దారుణంగా అవమానించిందని గుర్తు చేశారు. కనీసం సభ్యత్వ నమోదు చేయించేందుకు పుస్తకాలు కూడా ఇవ్వలేదన్నారు. కానీ జగిత్యాల మున్సిపల్ ఎన్నికల్లో జీవన్ రెడ్డి అనుచరులు 20 మందికి కాంగ్రెస్ పార్టీ బీఫామ్స్‌లు ఇచ్చిందని గుర్తు చేశారు.  జిల్లా అధ్యక్షుడిగా కూడా జీవన్ రెడ్డి అనుచరుడికే కాంగ్రెస్ పార్టీలో అవకాశం ఇచ్చామని గుర్తు చేశారు. గతంలో జూపల్లి కృష్ణారావును బీఆర్ఎస్ పార్టీలో ఘోరంగా అవమానించారని.. ఒక్క టికెట్ కూడా మున్సిపల్ ఎన్నికల్లో ఇవ్వలేదని గుర్తు చేశారు. ఈ పరిస్థితుల్లో జీవన్ రెడ్డి తనను అవమానించారంటూ మాట్లాడటం సరికాదన్నారు.

బావతో పోటీపడుతున్న కేటీఆర్

కేటీఆర్ తన బావ హరీశ్ రావుతో పోటీ పడుతున్నారని చామల (MP Chamala) ఎద్దేవా చేశారు. ఎక్కడ చూసినా హరీశ్ రావు పేరే వినిపిస్తోందని.. అందుకే కేటీఆర్ అమెరికా నుంచి ఫ్లైట్ దిగగానే నేరుగా జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లి డ్రామా చేశారని పేర్కొన్నారు. ఇటీవల ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి వచ్చిన కేటీఆర్ నోటికొచ్చినట్టు మాట్లాడారని మండిపడ్డారు. ఒక్క మున్సిపాలిటీ గెలిచినందుకే బీఆర్ఎస్ నేతలు సంబురాలు చేసుకుంటే .. మరి తాము 90 మున్సిపాలిటీలు గెలుచుకున్నామని పేర్కొన్నారు. కేటీఆర్ ఇప్పటికైనా అబద్ధాలు చెప్పకుండా నిజాలు మాట్లాడాలని సూచించారు. కేటీఆర్ పచ్చి అబద్ధాలు చెబుతుండటంతో ప్రజలు ప్రతి ఎన్నికలోనూ బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెబుతూనే ఉన్నారని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డికి ఫ్యూచర్ లేదు అంటున్న కేటీఆర్ తన ఫ్యూచర్ ఏమిటో అర్థం చేసుకోవాలని కోరారు. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ పడిపోయిందని కేటీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ డౌన్ అయ్యిందని.. అందులో భాగంగానే హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ పడిపోయిందని గుర్తు చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>