కలం, మహబూబ్ నగర్ బ్యూరో: మట్టి పాత్రలను వినియోగించడం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా పొందవచ్చని ప్రభుత్వ విప్, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (Yennam Srinivas Reddy) అన్నారు. మహబూబ్ నగర్ (Mahabubnagar) లోని మెట్టుగడ్డలో నాబార్డ్ వారి ఆర్థిక సహాయంతో ఆదివారం మొల్లమాంబ పోటరీ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ మట్టిపాత్రల విక్రయ కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాన్ని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణతో కలిసి ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి, సంప్రదాయ మట్టి పాత్రలను ప్రోత్సహించడం అవసరమని పేర్కొన్నారు. మట్టి పాత్రల్లో వండిన ఆహారం ఆరోగ్యానికి మేలు చేస్తుందని, పర్యావరణానికి హాని కలగకుండా సహజ జీవనశైలిని ప్రోత్సహిస్తుందని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు స్థానిక మట్టి కళాకారులకు ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా, సంప్రదాయ కళలను పరిరక్షించడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, నాయకులు సుధాకర్ రెడ్డి, గోవింద్ యాదవ్, నాబార్డ్ డీడీఎం షణ్ముఖ చారి, డైరెక్టర్ రజిని, కుమ్మర సంఘం నాయకులు బుగ్గన్న, నాగప్ప, రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

