రైతుల విద్యుత్​ సమస్యకు పరిష్కారానికి ప్రత్యేక చర్యలు : యెన్నం

కలం, మహబూబ్ నగర్ బ్యూరో : తాను ఎమ్మెల్యే అయ్యాక రెండున్నరేళ్లలోనే కొత్తగా 11 విద్యుత్తు సబ్‌స్టేషన్లను మంజూరు చేయించి నిర్మాణ పనులు ప్రారంభించామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (MLA Yennam Srinivas Reddy) తెలిపారు. ఆదివారం మహబూబ్‌నగర్ నియోజకవర్గం లోని రైతులకు వ్యవసాయ వినియోగదారుల విద్యుత్తు నియంత్రికల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై రైతులకు పంపిణీ చేశారు.

అనంతరం యెన్నం మాట్లాడుతూ విద్యుత్ శాఖకు సంబంధించి నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ వాటి పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. సబ్‌స్టేషన్ల నిర్మాణానికి ఎదురైన భూ సమస్యలను పరిష్కరించి, టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభించామని తెలిపారు. కొన్ని సబ్‌స్టేషన్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయని, మరికొన్ని ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని వివరించారు. అవసరమైన ప్రాంతాల్లో అదనపు సబ్‌స్టేషన్ల నిర్మాణంతో పాటు, హన్వాడ మండలంలోని గొండ్యాల గ్రామంలో 132 కేవీ సామర్థ్యం కలిగిన భారీ విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణానికి కూడా కృషి చేస్తున్నామని వెల్లడించారు.

రైతులకు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లతో పాటు గృహ విద్యుత్ వినియోగంలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించేందుకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ఆయన (MLA Yennam Srinivas Reddy) తెలిపారు. నియోజకవర్గంలో ఇప్పటివరకు సింగిల్ ఫేజ్, త్రీ ఫేజ్ కలిపి మొత్తం 587 ట్రాన్స్‌ఫార్మర్లను అందజేశామని చెప్పారు. ఇంకా ఎక్కడైనా ట్రాన్స్‌ఫార్మర్ల అవసరం ఉంటే తన దృష్టికి తీసుకురావాలని, రైతులకు ఇబ్బందులు కలగకుండా మరిన్ని ట్రాన్స్‌ఫార్మర్లు మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు.

పెరిగిన విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా ఎలాంటి కోతలు లేకుండా, ప్రజలకు రైతులకు ఇబ్బందులు కలగకుండా విద్యుత్ సరఫరా చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేకపోయినా రైతులు, గ్రామీణ ప్రజలు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో అవసరమైన విద్యుత్‌ను అందుబాటులో ఉన్న ధరలకు కొనుగోలు చేసి సరఫరా చేస్తున్నామని యెన్నం వివరించారు. గత పదేళ్లలో విద్యుత్ ఉత్పత్తి రంగంలో తగినంత పురోగతి సాధించలేకపోయారని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు చర్యలు చేపట్టిందన్నారు.

కొత్త థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌ను కూడా వినియోగంలోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. తాము ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని, సమస్యల పరిష్కారం కోసం ప్రజలు ఎప్పుడైనా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి రావచ్చని తెలిపారు. 24 గంటలూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని స్పష్టం చేశారు.

గ్రామాల్లో రాజకీయ పార్టీల మధ్య ఉన్న విభేదాలను అభివృద్ధికి అడ్డంకిగా మారనివ్వబోమని యెన్నం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ఏ పార్టీకి చెందిన సర్పంచ్ అయినా, ప్రజాప్రతినిధి అయినా గ్రామ అభివృద్ధి కోసం తన వద్దకు వస్తే తప్పకుండా సహకరిస్తామని తెలిపారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల సమగ్ర అభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని, ప్రజలందరికీ సమాన అవకాశాలు కల్పిస్తూ ముందుకు సాగుతామని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, విద్యుత్ శాఖ ఎడి సంతోష్, డిసిసి ప్రధాన కార్యదర్శి బుద్దారం సుధాకర్ రెడ్డి, హన్వాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వి.మహేందర్, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, హన్వాడ మండల కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వహక అధ్యక్షులు చెన్నయ్య, నాయకులు జి.నర్సింహులు, టంకర కృష్ణయ్య యాదవ్, యాదిరెడ్డి, జె.వెంకటయ్య, గోవింద్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>