తాగునీటి సమస్యలకు ఇక చెక్.. పాలమూరుకు భారీ వాటర్ ప్రాజెక్ట్!

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: పాలమూరు నగర ప్రజల ప్రస్తుత, భవిష్యత్తు తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని శాశ్వత తాగునీటి పరిష్కారం కోసం రూ. 220 కోట్లతో అదనంగా 18 మిలియన్‌ లీటర్ల నీటి నిల్వ సామర్థ్యాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి (MLA Yennam Srinivas Reddy) తెలిపారు.

ప్రస్తుతం మహబూబ్ నగర్‌ (Mahabubnagar) లో 20 మిలియన్‌ లీటర్ల నీటి నిల్వ సామర్థ్యం ఉన్నప్పటికీ, పెరుగుతున్న అవసరాలకు అది సరిపోవడం లేదన్నారు. పైప్‌లైన్‌ లీకేజీలు, పంపింగ్‌ సామర్థ్యం తగ్గడం, నీటి సరఫరాలో అంతరాయాలు వంటి కారణాలతో నగరంలోని పలు ప్రాంతాల్లో నీటి కొరత ఏర్పడుతోందని చెప్పారు.

ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు అదనంగా 18 మిలియన్‌ లీటర్ల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్లు, ఓవర్‌హెడ్‌ సర్వీస్‌ రిజర్వాయర్లను నిర్మిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రభుత్వ భూముల్లో ట్యాంకుల నిర్మాణం చేపట్టాల్సి ఉండటంతో అక్కడక్కడా ఎదురవుతున్న భూ సంబంధిత సమస్యలను పరిష్కరించుకుంటూ పనులను ముందుకు తీసుకెళ్తున్నామని ఎమ్మెల్యే (MLA Yennam) తెలిపారు.

ఇప్పటికే 8 OHSRలకు శంకుస్థాపన చేయగా, నేడు మౌలాలిగుట్ట (500 కిలో లీటర్ల సామర్థ్యం, రూ. 328.72 లక్షలు) మెట్టుగడ్డ (1200 కిలో లీటర్ల సామర్థ్యం, రూ. 261.02 లక్షలు) టీచర్స్‌ కాలనీ (2000 కిలో లీటర్ల సామర్థ్యం, రూ. 391.46 లక్షలు) ప్రాంతాల్లో మరో మూడు OHSRలకు శంకుస్థాపన చేసినట్లు చెప్పారు.

మిగిలిన ట్యాంకుల నిర్మాణ పనులను కూడా త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. అన్ని ట్యాంకుల నిర్మాణం పూర్తయిన తర్వాత నగరంలో నీటి నిల్వ సామర్థ్యానికి సంబంధించిన సమస్య ఉండదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పంపింగ్‌లో ఒకరోజు ఆలస్యం జరిగినా ముందుగానే నీటిని నిల్వ చేసుకుని ప్రజలకు సరఫరా చేసే అవకాశం ఉంటుందని అన్నారు.

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్‌గా మారిన నేపథ్యంలో నగర మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం నుంచి భారీగా నిధులు తీసుకువస్తున్నామని పేర్కొన్నారు. ఇందులో భాగంగా రూ. 600 కోట్లతో అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేయించుకున్నామన్నారు.

రాబోయే వారం, పది రోజుల్లో ఒక్కో కాలనీ, ఒక్కో డివిజన్‌లో దశలవారీగా పనులకు శంకుస్థాపనలు ప్రారంభిస్తామని చెప్పారు. రాబోయే రెండు, మూడు సంవత్సరాల్లో అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ వ్యవస్థను పూర్తిచేసేలా ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. డ్రైనేజీ పనుల సమయంలో రోడ్ల తవ్వకాలు, కొన్ని మార్గాలను తాత్కాలికంగా మూసివేయడం వంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని, నగర ప్రజలు అభివృద్ధి పనులకు సహకరించాలని కోరారు.

మహబూబ్‌నగర్‌ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కేవలం అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ కోసం రూ. 600 కోట్ల నిధులను తీసుకువచ్చామని తెలిపారు. ఈ నిధుల మంజూరులో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పూర్తి సహకారం అందించారని పేర్కొన్నారు. తాగునీరు, డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు మహబూబ్‌నగర్‌ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.

ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, నగర డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సిరాజ్ ఖాద్రీ, కార్పొరేటర్లు పెద్ద గొల్ల నర్సింహులు, తాహెర్, వాణిశ్రీ ప్రశాంత్, రమేష్ రెడ్డి , విట్టల్ రెడ్డి, ఫకృ, షబ్బీర్ అహ్మద్, సల్మాన్, తిరుమల వెంకటేష్, మేగ్యా నాయక్,అవేజ్, నాయకులు మైత్రి యాదయ్య, రమేష్ యాదవ్, వాల్దాస్ ప్రతాప్ గౌడ్, వర్థ రవి, అశ్వాక్, శివ, తదితరులు పాల్గొన్నారు.

Also Read : రాయదుర్గం భూములకు రికార్డ్ ధర.. ఎకరం రూ.264 కోట్లు

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>