కలం, నల్లగొండ: రాష్ట్రంలో బీఆర్ఎస్ (BRS) పార్టీకి ప్రజల్లో ఆదరణ పూర్తిగా కరువైందని, రోజురోజుకూ దిగజారుతున్న తమ రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకే ఆ పార్టీ నాయకులు మహిళా కమిషన్ డ్రామాలకు తెరలేపారని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే (Nakrekal MLA) వేముల వీరేశం (Vemula Veeresham) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లోని అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ముఖ్యమంత్రి నిర్వహించిన ఫ్లాష్ సర్వేలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వానికి తెలంగాణ ప్రజల పూర్తి ఆశీస్సులు ఉన్నాయని స్పష్టంగా తేలిందని వేముల వీరేశం వెల్లడించారు. బీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోవడంతో దిక్కుతోచని స్థితిలోనే ఆ పార్టీ నేతలు మహిళా కమిషన్‌ను ఆశ్రయించే స్థాయికి దిగజారారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్‌లో మహిళలకు లభించే గౌరవం ఎలాంటిదో గతంలో వారి సొంత చెల్లెలు కవిత స్వయంగా తెలిపారని, అలాంటిది ఇప్పుడు మహిళల గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్‌కు ఎక్కడుందని ప్రశ్నించారు.
అసెంబ్లీలో అత్యంత కీలకమైన ’22-A’ భూముల అంశంపై చర్చ జరుగుతుంటే, బాధ్యతాయుతంగా సమాధానం చెప్పలేక బీఆర్ఎస్ నాయకులు సభ నుంచి తప్పించుకుని తిరుగుతున్నారని నిలదీశారు. గత పదేళ్ల పాలనలో దళితులు, మహిళలు, బలహీన వర్గాలకు తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య, కొప్పుల ఈశ్వర్ వంటి దళిత నాయకులను బీఆర్ఎస్ అధిష్టానం అవమానించిన తీరును తెలంగాణ సమాజం ఇంకా మర్చిపోలేదని గుర్తుచేశారు. ప్రజా సంక్షేమం, సామాజిక న్యాయమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని, బీఆర్ఎస్ ఎన్ని రాజకీయ డ్రామాలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదని వేముల వీరేశం స్పష్టం చేశారు.

