కలం, వెబ్ డెస్క్ : సికింద్రాబాద్ బొల్లారం మిలిటరీ క్యాంప్ లో చోటుచేసుకున్న సంచలనాత్మక ఆయుధాల చోరీ (Bollaram Arms Theft) కేసును పోలీసులు ఛేదించారు. 11 రోజుల పాటు నిర్వహించిన తీవ్ర గాలింపు చర్యల అనంతరం తెలంగాణ సీఐ సెల్, హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్, మల్కాజిగిరి పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్‌ను పూర్తి చేశారు. మొత్తం 12 ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి, తెల్లవారుజామున హైదరాబాద్ శివారు ప్రాంతంలో చేపట్టిన భారీ ఆపరేషన్‌లో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.
రెండు నెలల క్రితమే రిటైర్ అయిన ఒక మాజీ మిలిటరీ అధికారి ఈ చోరీకి ప్రధాన సూత్రధారిగా వ్యవహరించగా, అతనికి మరో ముగ్గురు మిలిటరీ అధికారులు పూర్తిగా సహకరించినట్లు దర్యాప్తులో నిర్ధారణ అయింది. చెడు వ్యసనాలకు బానిసై ఈ ఆయుధాల దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. నిందితుల నుంచి చోరీకి గురైన 12 తుపాకులు, 21 మ్యాగజైన్లు, నైట్ విజన్ పరికరాలు 1,900కు పైగా బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

