కలం, నకిరేకల్: పేద కుటుంబాలకు అనారోగ్య సమయాల్లో ముఖ్యమంత్రి సహాయ నిధి కొండంత అండగా నిలుస్తుందని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం (MLA Vemula Veeresham) అన్నారు. నకిరేకల్ పట్టణంలోని పన్నాలగూడెం క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాలకు చెందిన లబ్ధిదారులకు ఆయన చెక్కులను పంపిణీ చేశారు. మొత్తం 138 మంది లబ్ధిదారులకు రూ.45,25,150 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతూ సీఎం సహాయ నిధి కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సహాయం అందుతుందని భరోసా ఇచ్చారు. చెక్కులు అందుకున్న లబ్ధిదారులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఇప్పటికే విజయవంతంగా ముగిసిందని, రామన్నపేట మండలంలో మరో మూడు రోజుల్లో పూర్తవుతుందని ఎమ్మెల్యే వెల్లడించారు.
ఈ ఏడాది రైతులు రికార్డు స్థాయిలో పంట పండించారని, గతంలో ఎన్నడూ లేని విధంగా అద్భుతమైన దిగుబడులు వచ్చాయని పేర్కొన్నారు. ఐతే, ధాన్యం కొనుగోలు చేసిన కేవలం మూడు రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనని ఆయన గర్వంగా ప్రకటించారు. “కాళేశ్వరం ప్రాజెక్టు లేకుండానే ఈ ఏడాది ఇన్ని పంటలు పండాయి. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే పంటల దిగుబడి పెరిగిందని ప్రచారం చేసిన మాటల్లో నిజం లేదని, అదంతా అబద్ధమని ఇప్పుడు రుజువైంది.’ అని వేముల వీరేశం తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమం, అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తోందని ఎమ్మెల్యే కొనియాడారు. నియోజకవర్గంలోని పేద ప్రజల సొంతింటి కలను నెరవేర్చేందుకు త్వరలోనే పెద్ద ఎత్తున ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు.

