‘కాళేశ్వరం’పై కాంగ్రెస్‌వన్నీ కుట్రలే: పుట్ట మధు

కలం, కరీంనగర్ బ్యూరో: ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్‌ ఇరిగేషన్‌గా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇన్ని రోజులు కాంగ్రెస్‌ పార్టీ చేసినవన్నీ కుట్రలేనని తేలిపోయిందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ (Putta Madhu) స్పష్టం చేశారు. బుధవారం మంథని మండలం సిరిపురం గ్రామంలోని సుందిళ్ల బరాజ్‌లో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిత్రపటానికి భూపాలపల్లి జిల్లా పరిషత్‌ మాజీ చైర్‌ పర్సన్‌ జక్కు శ్రీహర్షిణీ తోకలిసి పాలాభిషేకం చేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్‌ నైపుణ్యతపై కాంగ్రెస్‌ పార్టీ మూడు సంవత్సరాలుగా చేసిన కుట్రలను వాటర్‌ పవర్‌ సెంట్రల్‌ రీసెర్చ్‌ స్టేషన్‌, ఎన్‌డీఎస్‌ఏ బృందం పటాపంచలు చేస్తూ హైకోర్టుకు నివేదికలు అందించిందని ఆయన తెలిపారు. కాళేశ్వరంపై చేసిన ఆరోపణలు ఏవీ నిజం కాదని నిర్తారణ అయిందన్నారు. అతి పెద్ద ప్రాజెక్టును నిర్మించి అందుబాటులోకి తీసుకువస్తే రేవంత్‌రెడ్డి నిర్వీర్యం చేయాలని చూస్తుంటే మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌ ముఖ్యమంత్రి అడుగులకు మడుగులు ఒత్తుతూ చూస్తు ఉండిపోయాడని ఆయన విమర్శించారు.

ఒక్క చెక్‌ డ్యాం, ఒక్క బ్రిడ్జి కట్టలేదు..

తండ్రి కొడుకులు ఈ నియోజకవర్గంలో అనేక ఏండ్లు పాలించి ఒక్క చెక్‌ డ్యాం, ఒక్క బ్రిడ్జి కట్టలేదని విమర్శించారు. అదే కేసీఆర్ హాయాంలో తాను ఎమ్మెల్యే ఉన్న సమయంలో బొక్కలవాగుపై చెక్‌డ్యాంలు, గోదావరిపై బ్రిడ్జిలు నిర్మించామని గుర్తు చేశారు. 150 కిలో మీటర్ల విస్తీర్ణంలో నిండుకుండలా సముద్రాన్ని తలపించేలా ఉన్న గోదావరినదిని రేవంత్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌లు నిర్వీర్యం చేయాలని ఏడారిని తలపించేలా చేశారని ఆయన అన్నారు.

ఇప్పటి వరకు దోచుకున్న కాడికి సరిపోతదని, వేల కోట్లు దోచుకున్నారని ఇప్పటికే జోరుగా ప్రచారం జరుగుతోందని, ఇప్పటకైనా దుద్దిళ్ల శ్రీధర్‌ కళ్లు తెరువాలన్నారు. ఆనాడు ప్రాజెక్టు ద్వారా మత్స్య సంపద పెరిగిందని, గ్రౌండ్ వాటర్ పెరిగి సాగు విస్తీర్ణం కూడా పెరిగిందని ఆయన వివరించారు. ఒకప్పుడు బతుకు దెరువు కోసం దుబాయ్‌లాంటి దేశాలకు వలసపోయిన బెస్తపల్లి వాసులు ప్రాజెక్టు నిర్మాణంతో మత్స్య సంపద పెరిగి ఇక్కడికే వచ్చారని, మళ్లీ కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బరాజ్‌లో నీటిని నిల్వ చేయకపోవడంతో ఉపాది లేక వలసబాట పట్టారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఢిల్లీకి మూటలు మోసుకుపోతున్న సీఎం..

ప్రాజెక్టులో నీళ్లు నిలిపే అంశం ప్రభుత్వం మీద ఉందని దాన్ని తాము వ్యతిరేకించడం లేదని సెంటర్‌ వాటర్‌ రిసెర్చ స్టేషన్‌, ఎన్‌డీఎస్‌ఏ బృందం చెప్తున్నా కానీ సుందిళ్ల బ్యారేజీకి ఏమీ కాకున్నా నీళ్లు ఆపకుండా నిర్వీర్యం చేయాలని మంథని ఎమ్మెల్యే చూశాడని అర్థం అవుతుందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్నా ఇంకా ప్రజలపై మమకారం పెరుగడం లేదన్నారు. కేవలం ఢిల్లీకి మూటలు మోసుకుపోవడం తప్ప రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచించడం లేదని ఆయన విమర్శించారు.

కేసీఆర్‌, బీఆర్ఎస్‌ పార్టీ రాష్ట్ర ప్రయోజనాలు, ప్రతి వర్గం కోసం పని చేశారని, అందుకే మంచి ఫలితాలు వచ్చాయని గుర్తించాలన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం బరాజ్‌ల గేట్లు మూసి నీళ్లు ఆపాలని, లేనిపక్షంలో ప్రజలే నీళ్లు ఆపుకునే రోజులు వస్తాయని ఆయన హెచ్చరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>