వేతనాలు తగ్గిస్తే ఉద్యమం ఉధృతం: ఏఐటీయూసీ

కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో పనిచేస్తున్న వివిధ కేటగిరీల కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది వేతనాలను తగ్గించే ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని తెలంగాణ మున్సిపల్ అండ్ కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ (AITUC) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వనంపల్లి జైపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం మహబూబ్‌నగర్ (Mahabubnagar) జిల్లా కేంద్రంలోని ఏఐటీయూసీ కార్యాలయంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పి. సురేష్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన జైపాల్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్, ఎన్‌ఎంఆర్ కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. పర్మినెంట్ చేసే వరకు ప్రతి కార్మికుడికి నెలకు కనీసం రూ.26 వేల వేతనం చెల్లించాలని కోరారు.

ఒకవైపు మున్సిపల్ కార్మికుల వేతనాలు పెంచాలని కార్మిక సంఘాలు పోరాటాలు చేస్తుంటే, మరోవైపు ప్రభుత్వం కంప్యూటర్ ఆపరేటర్లు, వర్క్ ఇన్‌స్పెక్టర్లు, డ్రైవర్లు, వాటర్ సప్లై సిబ్బంది, బిల్ కలెక్టర్లు, శానిటరీ జవాన్లు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, ఎన్‌ఎంఆర్ కార్మికుల వేతనాలను తగ్గించేలా ఆదేశాలు ఇవ్వడం సరికాదన్నారు. ఉన్న వేతనాలను తగ్గించడం కార్మిక చట్టాలకు విరుద్ధమని పేర్కొన్నారు. గతంలో ప్రభుత్వం జారీ చేసిన జీవో ఎంఎస్ నెం.14, జీవో ఎంఎస్ నెం.60, జీవో ఎంఎస్ నెం.63 ప్రకారం మున్సిపల్ కార్మికులకు కేటగిరీల వారీగా వేతనాలు అమలవుతున్నాయని తెలిపారు. 2022లో మే డే సందర్భంగా పారిశుధ్య విభాగం కార్మికుల వేతనాలను రూ.1,000 పెంచినట్లు పేర్కొన్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఆయా కేటగిరీలకు అనుగుణంగా వేతనాలు అమలు చేస్తున్నారని తెలిపారు.అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డ్రైవర్లు, వర్క్ ఇన్‌స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లు, శానిటరీ జవాన్లు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, కంప్యూటర్ ఆపరేటర్ల వేతనాలను తగ్గించేలా ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ 2026 జూలై 12న జీఓ ఆర్టీ నెం.1181 జారీ చేసిందని జైపాల్ రెడ్డి ఆరోపించారు. ఈ జీఓను వెంటనే ఉపసంహరించుకుని గతంలో అమలు చేసిన వేతనాలనే కొనసాగించాలని డిమాండ్ చేశారు.

విధి నిర్వహణలో లేదా అనారోగ్యంతో కార్మికుడు మరణించినప్పుడు, అలాగే 60 ఏళ్లు నిండిన కార్మికుల కుటుంబాల్లో ఒకరికి మానవతా దృక్పథంతో ఉద్యోగం కల్పించాలని కోరారు. మరణించిన కార్మికుల అంత్యక్రియలకు రూ.30 వేల ఆర్థిక సాయం, కార్మికులకు మున్సిపల్ అధికారుల ఆధ్వర్యంలో బీమా సౌకర్యం, రూ.10 లక్షల రిటైర్‌మెంట్ బెనిఫిట్ కల్పించాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం గురువారం ఇందిరా పార్క్ వద్ద నిర్వహించనున్న ధర్నాకు పెద్ద సంఖ్యలో కార్మికులు తరలిరావాలని జైపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి పి. సురేష్, జిల్లా నాయకులు యాదయ్య, కృష్ణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ రెడ్డి, రైతు సంఘం జిల్లా నేత చాంద్ భాష తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>