కలం, హనుమకొండ : రేషన్ కార్డులు, పెన్షన్లు, ఇతర ప్రభుత్వ పథకాల కోసం ఎవరైనా రాజకీయ నాయకులు లేదా అధికారులు డబ్బులు అడిగితే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి (MLA Naini Rajender Reddy) తెలిపారు. పేదలకు సంబంధించిన ప్రతి పథకం ఉచితమేనని, మధ్యవర్తులు లేకుండా లబ్ధిదారుల చేతికే నేరుగా ప్రయోజనాలు చేరే విధంగా వ్యవస్థను అమలు చేస్తున్నామని తెలిపారు. ఎవరైనా లంచాలు ఇచ్చి ప్రోత్సహిస్తే సమాజానికి అన్యాయం చేసినట్లవుతుందన్నారు.
వరంగల్ పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా 53వ డివిజన్ పరిధిలోని లష్కర్ నగర్ సింగారం, గోపాల్ పూర్ జంక్షన్ ప్రాంతాల్లో సుమారు రూ.2.10 కోట్ల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాల హయాంలో ఒక్కో డివిజన్‌కు నామమాత్రంగా నిధులు కేటాయించేవారని, ప్రస్తుతం ఒక్కో డివిజన్‌కు రూ.10 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకు అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు.
వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ప్రతి కాలనీకి మెరుగైన రోడ్లు, డ్రైనేజీలు, మౌలిక సదుపాయాలు కల్పించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. గతంలో పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, రేషన్ కార్డులు, పెన్షన్లు అందని పరిస్థితి ఉండేదని, ప్రస్తుతం అర్హులైన ప్రతి లబ్దిదారునికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు పారదర్శకంగా అందేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. పెన్షన్లు, రేషన్ కార్డుల అర్హుల జాబితాలను డివిజన్ వారీగా తుది దశకు తీసుకువచ్చామని వెల్లడించారు.
అభివృద్ధిపై చర్చకు ఎప్పుడూ సిద్ధమే…
అభివృద్ధి పై చర్చకు తాము ఎప్పుడు సిద్ధమేనని.. కానీ ఆధారాలు లేకుండా విమర్శలు చేయడం సరికాదని ఎమ్మెల్యే (MLA Naini Rajender Reddy) పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే వరంగల్ ఎయిర్పోర్ట్ భూసేకరణ కోసం వందల కోట్ల రూపాయలు వెచ్చించి కేంద్ర ప్రభుత్వానికి భూమి అప్పగించిందన్నారు. అయినప్పటికీ కేంద్రం విమానాశ్రయ అభివృద్ధిని వేగవంతం చేయలేదని విమర్శించారు.
బీజేపీ నాయకులు అభివృద్ధి పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, పదేళ్లుగా అధికారంలో ఉన్నప్పటికీ వరంగల్‌కు ఎయిర్పోర్ట్ పూర్తి చేయలేదని అన్నారు. బీఆర్ఎస్ నాయకులు అభివృద్ధిపై చర్చించకుండా అనవసర రాజకీయ విమర్శలకు పాల్పడుతున్నారని అన్నారు. ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని, ఎవరు అభివృద్ధి చేశారో, ఎవరు కేవలం విమర్శలు చేస్తున్నారో ప్రజలే నిర్ణయిస్తారని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

