కలం, వనపర్తి: నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణంలో భూములు కోల్పోయిన నిర్వాసితులకు న్యాయం చేయడమే ప్రజా ప్రభుత్వ తొలి ప్రాధాన్యత అని వనపర్తి ఎమ్మెల్యే (Wanaparthy MLA) తూడి మేఘారెడ్డి (Tudi Megha Reddy) అన్నారు. గురువారం కలెక్టరేట్లో బండరావిపాకుల (Banda Ravipakula) ముంపు బాధితులకు పరిహారం చెక్కుల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా 125 మంది లబ్ధిదారులకు రూ. 8.33 కోట్ల పరిహారం చెక్కులను అందజేశారు. బండరావిపాకుల (Banda Ravipakula), కొంకలపల్లి ముంపు నిర్వాసితుల కోసం ప్రభుత్వం మొత్తం రూ.67 కోట్ల పరిహారం విడుదల చేసిందని ఎమ్మెల్యే తెలిపారు. బ్యాంకు ఖాతాల సమస్యలు, ఇతర కారణాలతో మిగిలిన వారికి కూడా త్వరలో పరిహారం అందిస్తామన్నారు.
ముంపు పునరావాస గ్రామాల్లో అర్హులైన కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని కోరినట్లు తెలిపారు. స్థానిక యువతకు ఉపాధి కల్పించేందుకు పర్యాటక శాఖ ద్వారా సుమారు రూ.2 కోట్ల నిధులు తీసుకురావడానికి చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. గ్రామాల్లో పెండింగ్‌లో ఉన్న నీటి ట్యాంకుల నిర్మాణం తదితర సమస్యలను త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ.. ముంపు బాధితులకు పరిహారం అందించేందుకు ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోందన్నారు. పరిహారాన్ని సద్వినియోగం చేసుకుని జీవనోపాధిని మెరుగుపరుచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీవో సుబ్రహ్మణ్యం, మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటేష్, అధికారులు, ప్రజాప్రతినిధులు, ముంపు బాధితులు పాల్గొన్నారు.

