అభివృద్ధి ఓర్వలేకే BRS అసత్య ప్రచారాలు: మేడిపల్లి సత్యం

కలం, కరీంనగర్: ప్రజా సంక్షేమమే పరమావధిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల విజయవంతమైన సంక్షేమ పాలన పూర్తి చేసుకుందని పేర్కొంటూ గంగాధర మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన సంబరాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంగాధర మండల కేంద్రం నుండి మధురానగర్ చౌరస్తా వరకు సుమారు రెండు కిలోమీటర్ల మేర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మండల కేంద్రంలోని బాబు జగ్జీవన్ రామ్, మధురానగర్ చౌరస్తాలోని డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఫామ్‌హౌస్‌కే కేసీఆర్ పరిమితం..

​అక్కడ సభలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజా పాలన అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజులు పూర్తి చేసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. గత పదేళ్ల కేసీఆర్ పాలనలో రూ. 8 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని విమర్శించారు. ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుండి కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా, ప్రతిపక్ష పాత్ర పోషించడంలో విఫలమై వెయ్యి రోజులుగా ఫామ్ హౌస్‌కే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు.

​కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ విజయాలు..

​25 లక్షల మంది రైతులకు రూ. 2 లక్షల వరకు రుణమాఫీ అమలు, ప్రతి నియోజకవర్గానికి 6,500 ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు, కొత్తగా 9 లక్షల మందికి రేషన్ కార్డుల పంపిణీ, ​గృహ జ్యోతి పథకం ద్వారా 53 లక్షల కుటుంబాలకు ఉచిత విద్యుత్, 43 లక్షల మంది లబ్ధిదారులకు క్రమం తప్పకుండా చేయూత పెన్షన్ల అందజేయడం జరిగిందని పేర్కొన్నారు.

కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు..

​రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి తట్టుకోలేక బిఆర్ఎస్ నాయకులు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా తెలంగాణలో సంక్షేమ పాలన ఆగదని, కాంగ్రెస్ పార్టీ రాబోయే పదివేల రోజులు అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ విజయోత్సవ కార్యక్రమానికి తరలివచ్చిన ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలకు, మహిళలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ​ఈ కార్యక్రమంలో చొప్పదండి నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, సింగిల్ విండో చైర్మన్లు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, మహిళా కాంగ్రెస్, యువజన కాంగ్రెస్, NSUI నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>