కలం, ఖమ్మం బ్యూరో: తెలంగాణ ప్రజలతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వాసుల దశాబ్దాల రైలు కల సాకారమయ్యే దిశగా కీలక ముందడుగు పడింది. ప్రతిపాదిత పాండురంగాపురం–మల్కన్‌గిరి రైల్వే ప్రాజెక్టుకు అటవీ శాఖ అనుమతులు, గోదావరి నదిపై భారీ వంతెనల నిర్మాణం, విస్తృత భూసేకరణ వంటి పలు సాంకేతిక, పరిపాలనా సమస్యలు అడ్డంకిగా మారిన నేపథ్యంలో.. ప్రాజెక్టును దశలవారీగా ముందుకు తీసుకెళ్లే వ్యూహం తెరపైకి వచ్చింది. మొత్తం ప్రాజెక్టు పూర్తయ్యే వరకు వేచి ఉండకుండా, ఎలాంటి పెద్ద అడ్డంకులు లేని పాండురంగాపురం–సాకేతపురి (సారపాక) (Pandurangapuram-Sarapaka) మధ్య 16 కిలోమీటర్ల రైల్వే మార్గాన్ని ముందుగా నిర్మించి అందుబాటులోకి తీసుకురావాలనే ప్రతిపాదనకు కేంద్రం నుంచి సానుకూల స్పందన లభించింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రతిపాదించిన ఈ వ్యూహానికి కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం భద్రాద్రి ప్రాంతానికి కీలక పరిణామంగా మారింది.
భద్రాచలానికి చేరువ కానున్న రైలు
పాండురంగాపురం నుంచి ఒడిశాలోని మల్కన్‌గిరి వరకు 130 కిలోమీటర్లకు పైగా సాగనున్న పూర్తి రైల్వే ప్రాజెక్టుకు ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది. అయితే మొదటి దశలో 16 కిలోమీటర్ల మార్గాన్ని పూర్తి చేయడం ద్వారా భద్రాచలానికి (Bhadrachalam) రైల్వే కనెక్టివిటీ మరింత చేరువ కానుంది. ప్రస్తుతం భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయాన్ని దర్శించుకునే భక్తులు దాదాపు 40 కిలోమీటర్ల దూరంలోని కొత్తగూడెం (భద్రాచలం రోడ్) రైల్వే స్టేషన్‌లో దిగి రోడ్డు మార్గంలో ప్రయాణించాల్సి వస్తోంది. సాకేతపురి (సారపాక) వరకు రైలు అందుబాటులోకి వస్తే ఆలయానికి మరింత సమీపంలో రైల్వే సౌకర్యం లభించనుంది. దీంతో భద్రాచలం పర్యాటక రంగానికి కొత్త ఊపు వచ్చే అవకాశం ఉంది. హోటళ్లు, రవాణా, హస్తకళలు, చిన్నతరహా వ్యాపారాలు అభివృద్ధి చెందడంతో స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంది.
పారిశ్రామిక రంగానికీ ప్రయోజనం
ఈ రైల్వే మార్గం కేవలం ఆధ్యాత్మిక రంగానికే కాకుండా పారిశ్రామిక అభివృద్ధికి కూడా దోహదపడనుంది. సారపాకలోని ఐటీసీ పేపర్ బోర్డ్స్, కేటీపీఎస్ పవర్ ప్లాంట్, సింగరేణి బొగ్గు గనులు, ఇతర పారిశ్రామిక సంస్థలకు ముడిసరుకు రవాణా సులభతరం కానుంది. రైల్వే ద్వారా తక్కువ ఖర్చుతో సరుకు రవాణా అందుబాటులోకి వస్తే పరిశ్రమల రవాణా వ్యయాలు తగ్గే అవకాశం ఉంది. దీంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్త పారిశ్రామిక పెట్టుబడులకు కూడా అనుకూల వాతావరణం ఏర్పడుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
దశలవారీగా పనులకు ప్రాధాన్యం
గతంలో పలువురు కేంద్ర రైల్వే మంత్రుల హయాంలో ఈ రైల్వే లైన్‌కు హామీలు లభించినప్పటికీ, మొత్తం ప్రాజెక్టును ఒకేసారి పూర్తి చేయాలనే విధానం వల్ల అనేక సమస్యలు ఎదురయ్యాయి. ప్రస్తుతం దశలవారీగా అభివృద్ధి చేయాలనే ప్రతిపాదనతో ముందుగా సాధ్యమైన మార్గాన్ని పూర్తి చేయడానికి అవకాశం ఏర్పడింది. గోదావరి నదిపై భారీ వంతెనలు, సుదీర్ఘ భూసేకరణ వంటి క్లిష్టమైన అంశాలతో సంబంధం లేని 16 కిలోమీటర్ల మార్గాన్ని ముందుగా చేపట్టడం వల్ల పనులు వేగంగా పూర్తయ్యే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసి రైల్వే శాఖకు అవసరమైన భూమిని అప్పగించేందుకు సిద్ధంగా ఉండటం కూడా ప్రాజెక్టుకు కలిసొచ్చే అంశంగా భావిస్తున్నారు.
అభివృద్ధికి బాట
దశాబ్దాలుగా ప్రతిపాదనలకే పరిమితమైన భద్రాద్రి రైలు కల ఇప్పుడు సాకేతపురి వరకు రైల్వే మార్గం రూపంలో వాస్తవానికి చేరువవుతోంది. ఈ 16 కిలోమీటర్ల మార్గం భక్తులకు రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచడంతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆధ్యాత్మిక, పర్యాటక, పారిశ్రామిక, ఆర్థిక అభివృద్ధికి బలమైన పునాదిగా మారుతుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

