ముర్రేడు, గంగమ్మగుడి వంతెనల నిర్మాణానికి శంకుస్థాపన

​కలం, ఖమ్మం బ్యూరో: ఏజెన్సీ ప్రాంతాల సమగ్ర వికాసమే లక్ష్యంగా కొత్తగూడెం నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయి. ఏళ్ల తరబడి వర్షాకాలంలో వాగులు ఉప్పొంగి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతూ గిరిజన, గ్రామీణ ప్రజలు పడుతున్న తిప్పలకు చెక్ పెడుతూ ముర్రేడు, గంగమ్మగుడి వాగులపై రూ.8.80 కోట్లతో నిర్మించనున్న హైలెవెల్ వంతెనల నిర్మాణ పనులకు కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు (Kunamneni Sambasiva Rao) శుక్రవారం శంకుస్థాపన చేశారు. లక్ష్మీదేవిపల్లి మండల పరిధిలోని హేమచంద్రపురం – అనిశెట్టిపల్లి గ్రామాల మధ్య ముర్రేడు వాగుపై రూ.7 కోట్లతో, రేగళ్ల ప్రాంతంలోని మున్యాతండా – పెద్దతండా గ్రామాల మధ్య గంగమ్మగుడి వాగుపై రూ.1.80 కోట్ల వ్యయంతో ఈ బ్రిడ్జిలను నిర్మిస్తున్నారు.

​ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూనంనేని మాట్లాడుతూ.. వర్షాకాలంలో మారుమూల గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకుని ప్రజలు పడే అవస్థలను గమనించి, ప్రభుత్వంతో పోరాడి ఈ నిధులను మంజూరు చేయించామని తెలిపారు. ఏజెన్సీ ప్రజల అవసరాలు, సంక్షేమానికి మొదటి ప్రాధాన్యం ఇస్తూ రవాణా వ్యవస్థను మెరుగుపరచడానికే ఈ బ్రిడ్జిల నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్, ఎంపిడివో సుస్మిత, తహశీల్దార్ శిరీష, స్థానిక సర్పంచులు, అధికారులు మరియు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>