కలం, స్పోర్ట్స్: కామన్వెల్త్ గేమ్స్‌లో(Commonwealth Games 2026) భారత జూడో జట్టు అదరగొడుతోంది. ఒకే రోజు ముగ్గురు భారత జూడోకాలు (Indian Judokas) ఫైనల్‌కు చేరుకుని సత్తా చాటారు. దీంతో భారత్‌కు కనీసం మూడు రజత పతకాలు ఖాయమయ్యాయి. ఇప్పుడు అందరి దృష్టి స్వర్ణ పతకాలపైనే ఉంది. మహిళల 48 కేజీల విభాగంలో అస్మితా డే అద్భుత ప్రదర్శనతో ఫైనల్‌కు చేరుకుంది. సెమీఫైనల్‌లో స్కాట్లాండ్‌కు చెందిన సమ్మర్ షాను యుకోతో ఓడించింది. అంతకుముందు క్వార్టర్ ఫైనల్‌లో స్కాట్లాండ్ క్రీడాకారిణి ఈవా ఇవింగ్‌పై ఇపాన్‌తో విజయం సాధించింది. ఫైనల్‌లో అస్మితా కెనడాకు చెందిన హైడీ క్వాచ్‌తో తలపడనుంది.
పురుషుల 60 కేజీల విభాగంలో హర్ష్ సింగ్ కూడా స్వర్ణ పోరుకు అర్హత సాధించాడు. సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియాకు చెందిన పెడ్రో కార్లోస్ ఆంటున్ నెటోపై వాజా-అరి ద్వారా విజయం సాధించాడు. తొలి రౌండ్‌లో మలావి క్రీడాకారుడు చికొండి కథేవెరాను, క్వార్టర్ ఫైనల్లో వనాటు ఆటగాడు అలన్ మోంతుయెల్‌ను ఓడించి సెమీస్‌కు చేరుకున్నాడు. ఫైనల్‌లో హర్ష్ సింగ్ ఆస్ట్రేలియాకు చెందిన జోషువా క్యాట్జ్‌తో పోటీపడనున్నాడు. మహిళల విభాగంలో యమిని మౌర్య కూడా ఫైనల్ బెర్త్ దక్కించుకుంది. సెమీఫైనల్‌లో దక్షిణాఫ్రికాకు చెందిన డోన్నే బ్రైటెన్‌బాక్‌ను ఇపాన్‌తో ఓడించింది. అంతకుముందు ఘానాకు చెందిన ఫ్రేమా అగ్యేపై విజయం సాధించింది. స్వర్ణ పతక పోరులో యమిని ఇంగ్లాండ్‌కు చెందిన అసెల్యా టోప్రాక్‌ను ఎదుర్కోనుంది.
అయితే మహిళల 52 కేజీల విభాగంలో శ్రద్ధ కదుబాల్ చోపడే పతకానికి చేరువై చివరకు నిరాశ చెందింది. తొలి పోరులో సియెర్రా లియోన్ క్రీడాకారిణిపై విజయం సాధించిన ఆమె.. క్వార్టర్ ఫైనల్‌లో ఆస్ట్రేలియాకు చెందిన టింకా ఈస్టన్ చేతిలో ఓడింది. రిపిచేజ్‌లో వేల్స్‌కు చెందిన లోలా హాడ్సన్ చేతిలో పరాజయం పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. పురుషుల 66 కేజీల విభాగంలో రోహిత్ బసీర్ మజ్‌గుల్ కూడా రిపిచేజ్‌లోనే ఓటమి చవిచూశాడు. తొలి పోరులో విజయం సాధించినా, క్వార్టర్ ఫైనల్లో సైప్రస్ ఆటగాడి చేతిలో ఓడిపోయాడు. అనంతరం రిపిచేజ్‌లో ఇంగ్లాండ్ క్రీడాకారుడిపై పరాజయం పొందాడు. మొత్తంగా కామన్వెల్త్ గేమ్స్ జూడోలో భారత ఆటగాళ్లు తమ ప్రతిభను చాటుతూ పతకాల వేట కొనసాగిస్తున్నారు.

