కలం, భువనగిరి : మే 8, 9, 10 తేదీల్లో భువనగిరి పట్టణంలోని న్యూ డైమెన్షన్ హైస్కూల్‌లో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి (MLA Kumbam Anil Kumar Reddy) తెలిపారు. ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలో నిరుద్యోగ సమస్యను తగ్గించి యువతకు విస్తృతంగా ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నామన్నారు. సామాజిక బాధ్యతగా యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కుంభం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ భారీ జాబ్ మేళాను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. భువనగిరి నియోజకవర్గంతో పాటు పరిసర ప్రాంతాల యువత కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ మెగా జాబ్ మేళాలో దేశవ్యాప్తంగా దాదాపు 20కి పైగా ప్రముఖ కంపెనీలు పలు రంగాల్లో 3500 ఉద్యోగ అవకాశాలను కల్పించనున్నట్లు తెలిపారు. యువత స్వయంగా ఎదగాలంటే ఇలాంటి అవకాశాలను అందిపుచ్చుకోవడం అవసరమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ జాబ్ మేళా ద్వారా వేలాది మంది యువతకు నేరుగా ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని తెలిపారు. అభ్యర్థులు తమ రెజ్యూమ్, ఆధార్ కార్డ్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు, విద్యార్హతల సర్టిఫికెట్లు తీసుకొని జాబ్ మేళాకు హాజరు కావాలని సూచించారు. ముందస్తుగా నమోదు చేసుకున్న వారికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. భువనగిరి నియోజకవర్గాన్ని ఉపాధి అవకాశాల కేంద్రంగా అభివృద్ధి చేయడం, నిరుద్యోగ యువతకు స్థిరమైన జీవనోపాధి కల్పించడం ఈ కార్యక్రమం లక్ష్యమని ఎమ్మెల్యే కుంభం స్పష్టం చేశారు. భవిష్యత్తులోనూ ఇలాంటి కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు.

