కలం, స్పోర్ట్స్ : లక్నో సూపర్ జయంట్స్‌తో జరుగుతున్న మ్యాచ్ (KKR vs LSG)లో కోల్‌కతా నైట్‌రైడర్స్ బ్యాటింగ్ లైనప్ చేతులెత్తేసింది. 27 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. 100 పరుగులయినా చేస్తుందా కేకేఆర్ అన్న అనుమానాలు కలిగాయి. అలాంటి సమయంలో మైదానంలోకి వచ్చిన రింకూ సింగ్.. కేకేఆర్‌ను కాపాడాడు. జట్టుకు గౌరవ ప్రదమైన స్కోర్ అందించడంలో కీలక పాత్ర పోషించారు. కెప్టెన్ రహానే, ఓపెనర్ సీఫెర్ట్, రఘువంశీ ఇలా అందరూ అతి తక్కువ స్కోర్‌కే పెవిలియన్ చేరుతున్న సమయంలో కామెరోన్ గ్రీన్ కాస్తంత ఊపందించాడు. ఆ తర్వాత గ్రీన్ కూడా ఔట్ కావడంతో కేకేఆర్ కథ అయిపోయిందని అనుకున్నా.. రింకూ సింగ్ మాత్రం ఒంటరి పోరాటం చేశాడు. ఎదుటివారు పెవిలియన్‌కు చేరుతున్నా ఒత్తిడిని ఎదుర్కొంటూ జట్టుకు మంచి స్కోర్ అందించడంలో కీలక పాత్ర పోషించాడు. లక్నో బౌలర్లలో మొహ్‌సిన్ ఖాన్.. కేకేఆర్ బ్యాటర్లకు సింహస్వప్నంలా మారాడు. కీ ప్లేయర్స్ వికెట్లను వరుసగా పడగొట్టి తన ఖాతాలో 5 వికెట్లు వేసుకున్నాడు. రింకూ పుణ్యమా అని నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేయగలిగింది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ రెండో ఓవర్‌లోనే ఓపెనర్ టిమ్ సీఫెర్ట్ (0) వికెట్‌ను మొహ్‌సిన్ పడగొట్టడంతో కేకేఆర్ పతనం మొదలైంది. కెప్టెన్ అజింక్య రహానే (10) కాసేపు క్రీజులో ఉన్నా భారీ స్కోరు చేయలేకపోయాడు. అంగ్‌క్రిష్ రఘువంశీ (9) వింతగా ‘అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్’ రూపంలో అవుట్ కావడం జట్టును మరింత దెబ్బతీసింది. ఇక రోవ్‌మన్ పవల్ (1), అనుకుల్ రాయ్ (0) కనీసం ఖాతా కూడా తెరవకుండానే మొహ్‌సిన్ దెబ్బకు వెనుదిరిగారు. దీంతో 31 పరుగులకే 4 వికెట్లు, 73 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కేకేఆర్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కామెరాన్ గ్రీన్ (34 పరుగులు; 21 బంతుల్లో, 3 సిక్సర్లు) కాస్త వేగంగా ఆడి ఇన్నింగ్స్‌కు ఊపిరి పోశాడు. గ్రీన్ అవుట్ అయిన తర్వాత రింకూ సింగ్ అసలు సిసలు ఆట మొదలుపెట్టాడు. లక్నో బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ 51 బంతుల్లోనే 83 పరుగులు బాదాడు. ఇందులో 7 ఫోర్లు, 5 భారీ సిక్సర్లు ఉన్నాయి. మొహ్‌సిన్ ఖాన్ ఒకవైపు వికెట్లు తీస్తున్నా, రింకూ మాత్రం తగ్గకుండా ఆడి స్కోరును 150 దాటించాడు. చివర్లో సునీల్ నరైన్ (4) అండగా నిలిచాడు.
లక్నో బౌలర్లలో మొహ్‌సిన్ ఖాన్ అద్భుతమైన స్పెల్‌తో ఆకట్టుకున్నాడు. 4 ఓవర్లలో కేవలం 23 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టి కేకేఆర్ నడ్డి విరిచాడు. మరో బౌలర్ జార్జ్ లిండే ఒక వికెట్ తీశాడు. షమీ, ప్రిన్స్ యాదవ్ వికెట్లు తీయకపోయినా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. ఇప్పుడు లక్నో విజయం సాధించాలంటే 120 బంతుల్లో 156 పరుగులు చేయాలి. పిచ్ కండిషన్స్ దృష్ట్యా ఈ లక్ష్యాన్ని ఛేదించడం లక్నోకు అంత సులభం కాకపోవచ్చు.

