చింతకానిలో ఖాకీల నిఘాకు చిక్కిన గంజాయి బ్యాచ్

కలం, మధిర: గంజాయి అక్రమ రవాణా, విక్రయాలను అరికట్టేందుకు ఖమ్మం జిల్లా చింతకాని పోలీసులు (Chintakani Police) ఏర్పాటు చేసిన ప్రత్యేక నిఘా సత్ఫలితాలను ఇచ్చింది. తుమ్మలమ్మ చెరువు కట్ట వద్ద గంజాయి విక్రయిస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. వీరి వద్ద నుండి రూ. 53,250 విలువైన 1.065 కిలోల ఎండు గంజాయితో పాటు, నేరానికి ఉపయోగిస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు, నాలుగు సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

​చింతకాని ఎస్‌ఐ జి. నరేష్ తన సిబ్బందితో కలిసి మంగళవారం రాత్రి మండలంలోని తుమ్మలమ్మ చెరువు కట్ట వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా, అక్కడ అనుమానాస్పదంగా తారసపడిన ఐదుగురు వ్యక్తులు పోలీసులను గమనించి పారిపోయేందుకు ప్రయత్నించారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది వారిని వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. ​పోలీసులు వారిని క్షుణ్ణంగా తనిఖీ చేసి విచారించగా గంజాయి విక్రయిస్తున్నట్లు బయటపడింది. పట్టుబడిన నిందితులను కొమ్ము ప్రణయ్, పెశెట్టి శ్రీశాంత్, మహ్మద్ అబ్దుల్ ఆదిల్, షేక్ అక్మల్, పెనుగొండ సాయిలుగా గుర్తించారు.

వీరికి గంజాయి సరఫరా చేస్తున్న టిన్ను @ వినయ్, షఫీ, జావేద్, ఖాజా, శ్రీకాంత్, ప్రకాష్ నగర్ సాయిలపై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేసినట్లు పోలీసులు వెల్లడించారు. పరారీలో ఉన్న సరఫరాదారులను కూడా త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. ​ఈ సందర్భంగా ఎస్‌ఐ జి. నరేష్ మాట్లాడుతూ.. యువత గంజాయి వంటి మత్తుపదార్థాలకు బానిసలై తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>