కలం, హుజూర్‌నగర్: రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరేయడం ఖాయమని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి (MLA Jagadish Reddy) ధీమా వ్యక్తం చేశారు. హుజూర్‌నగర్‌లో నిర్వహించిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ నమోదు నియోజకవర్గ సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం మీడియాతో ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మాట్లాడారు.
నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy)కి ఆయన శాఖపైనే కనీస అవగాహన లేదని, ఆయనొక ‘ఉత్త మంత్రి’ అని జగదీష్ రెడ్డి (Jagadish Reddy) ఎద్దేవా చేశారు. హుజూర్‌నగర్ నియోజకవర్గానికి నీళ్లు ఇవ్వకుండా, ఏపీ సీఎం చంద్రబాబు నియోజకవర్గానికి కృష్ణా నీళ్లను తరలించిన ఘనత ఉత్తమ్‌కే దక్కుతుందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని కరువు కమ్మేసిందని.. కృష్ణమ్మ నీళ్లను సద్వినియోగం చేసుకోవడం కూడా ఈ ప్రభుత్వానికి చేతకావడం లేదని విమర్శించారు.
సవాల్‌కు సిద్ధమా..?
కాళేశ్వరం ప్రాజెక్టుపై మంత్రి ఉత్తమ్‌కు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సవాల్ విసిరారు.”ఉత్తమ్ నాతో వస్తే ఆయనతోనే కన్నెపల్లి పంపులు ఆన్ చేయించి, కోదాడ వరకు నీళ్లు పారేలా చేస్తాను. మూడు రోజుల్లో సూర్యాపేట వరకు నీళ్లు తెచ్చి చూపిస్తా.. ఈ సవాల్‌కు సిద్ధమా? అని ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలో పచ్చటి పైర్లతో కళకళలాడిన పల్లెలు, నేడు నీళ్లు లేక నెర్రెలుబారి ఆకాశం వైపు చూస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు, రైతుల ఇబ్బందులు పట్టించుకోకుండా కాంగ్రెస్ నాయకులు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారని ధ్వజమెత్తారు. హుజూర్‌నగర్‌లో ప్రస్తుతం అవినీతి, దందాలు రాజ్యమేలుతున్నాయని.. ప్రజలను ఏడిపిస్తున్న నాయకుల ఉసురు ఊరికే పోదని హెచ్చరించారు.
Also Read : పాస్‌పోర్ట్ దరఖాస్తుదారులకు బిగ్ అలర్ట్
Follow Us On : WhatsApp

