కలం, మామడ: నిర్మల్ జిల్లా మామడ (Mamda) మండలం పోతారం గ్రామంలో మేడిగొంది పెద్ద భీమన్న స్వామి జాతర (Pedda Bheemanna Jatara) అంగరంగ వైభవంగా ముగిసింది. బుధవారం భీమన్న స్వామి గజాలను గ్రామంలోకి తీసుకురావడంతో జాతర ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. గురువారం నుంచి శనివారం రాత్రి వరకు స్వామివారి గజాలను చుట్టుపక్కల గ్రామాల్లో ఊరేగించారు. ఆదివారం స్వామివారి గజాలను తిరిగి పోతారం గ్రామానికి తీసుకువచ్చి ఇంటింటికీ ఊరేగిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం సాయంత్రం గంగాస్నానానికి బయలుదేరిన స్వామివారి గజాలు అర్ధరాత్రి ఆలయానికి చేరుకున్నాయి. ఈ సందర్భంగా గ్రామంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. సోమవారం ఉదయం బండారి బసంతంతో ప్రారంభమైన జాతర కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో ప్రశాంతంగా ముగిశాయి. జాతర సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

