కలం, స్పోర్ట్స్: తాజాగా హైలో ఓపెన్ విజేతగా నిలిచిన లక్ష్య సేన్ (Lakshya Sen) కొరియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీకి దూరం కానున్నారు. ఐదు లక్షల డాలర్ల ప్రైజ్ మనీతో మంగళవారం ప్రారంభమయ్యే ఈ సూపర్ 500 టోర్నీలో భారత జట్టును సీనియర్ ఆటగాడు హెచ్ఎస్ ప్రణయ్ ముందుండి నడిపించనున్నారు. జర్మనీలో టైటిల్ గెలిచి మంచి ఫామ్‌లోకి వచ్చిన లక్ష్య సేన్, తొలి రౌండ్లో చైనా ఆటగాడు డాంగ్ తియాన్ యావోతో తలపడాల్సి ఉంది. అయితే ఈ టోర్నీ నుంచి తప్పుకోవాలని ఆయన నిర్ణయించుకున్నారు. దాంతో 2023 ప్రపంచ ఛాంపియన్షిప్ కాంస్య పతక విజేత ప్రణయ్ తొలి రౌండ్లో దక్షిణ కొరియాకు చెందిన యూ తే బిన్‌తో తన పోరును ప్రారంభించనున్నారు.
ఈ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో చైనీస్ తైపీకి చెందిన టాప్ సీడ్ చౌ తియెన్ చెన్, జపాన్ ఆటగాడు కొడాయ్ నరాఓకా వంటి ప్రముఖ ఆటగాళ్లు బరిలో ఉన్నారు. మహిళల సింగిల్స్‌లో ఈ ఏడాది తైపీ ఓపెన్ గెలిచిన యువ ఆటగాడు తన్వి శర్మ తొలి పోరులో జపాన్‌కు చెందిన మనమి సుయిజుతో పోటీపడనుంది. మరో ఆటగాడు మాల్వికా బన్సోద్ నాలుగో సీడ్ కొరియా క్రీడాకారిణి సిమ్ యు జిన్‌తో తలపడనుంది.
హైలో ఓపెన్ సెమీఫైనల్లో పీవీ సింధుపై రాణించి ఫామ్‌లో ఉన్న 19 ఏళ్ల అన్మోల్ కర్బ్ తన తొలి మ్యాచ్‌లో కెనడాకు చెందిన రేచెల్ చాన్‌ను ఎదుర్కోనుంది. మహిళల డబుల్స్‌లో భారత్‌కు చెందిన సోనాలి సింగ్, రితిక ఠాకూర్ జోడీ ఆస్ట్రేలియాకు చెందిన లాడియా చెల్సియా గ్రిసెల్డా, నోజోమి షిమిజులతో తలపడనుంది. మిక్స్డ్ డబుల్స్‌లో ధ్రువ్ రావత్, కే మనీషా జోడీ చైనాకు చెందిన ఏడో సీడ్ జూ యి జున్, లీ ఖియాన్లతో పోటీపడనుంది.

