కలం, కరీంనగర్ బ్యూరో: వ్యవసాయానికి నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ రూరల్ మండలం గోపాల్‌పూర్ (Gopalpur) చౌరస్తా వద్ద రైతులు, స్థానిక ప్రజలు భారీ ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ (MLA Gangula Kamalakar) పాల్గొని రైతులకు మద్దతు తెలిపారు. విద్యుత్ అంతరాయాల వల్ల పంటలు ఎండిపోతున్నాయని, తరచూ కోతల కారణంగా మోటార్లు, ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని గంగుల కమలాకర్ విమర్శించారు. వానాకాలం పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.20 వేలు, యాసంగి పంట సాగు చేయలేని రైతులకు ఎకరానికి రూ.30 వేల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఆందోళన తీవ్ర రూపం దాల్చడంతో నిరసన తెలుపుతున్న ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ అరెస్ట్‌ను ఖండిస్తూ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన చేపట్టారు. దెబ్బతిన్న వ్యవసాయ మోటార్లు, ట్రాన్స్‌ఫార్మర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, పశుపోషక రైతులకు అవసరమైన సహాయం అందించి ఆదుకోవాలని కోరారు.

