అక్రమాలు చేయలేదు.. కేసులకు భయపడను : రేఖానాయక్

కలం, ఖానాపూర్ : తన పదేళ్ల ప్రజా జీవితంలో ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని, ప్రజలను మోసం చేయలేదని, కేసులకు భయపడే ప్రసక్తే లేదని ఖానాపూర్ (Khanapur) మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకురాలు అజ్మీరా రేఖానాయక్ (Rekha Naik) అన్నారు. శుక్రవారం ఖానాపూర్‌ పట్టణంలోని తన నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు నిర్వహించిన సోదాల అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. గతంలో అనుభవం లేకుండా రైస్ మిల్ వ్యాపారంలోకి అడుగుపెట్టి నష్టాలు చవిచూశానని, ఆ కారణంగా ప్రభుత్వానికి చెల్లించాల్సిన ధాన్యం సొమ్ము బకాయి పడటంతో తనపై కేసు నమోదైందని వివరించారు.

మొత్తం రూ.12 కోట్ల బకాయికి వడ్డీతో కలిపి రూ.22 కోట్లు ప్రభుత్వానికి చెల్లించేందుకు కోర్టు ద్వారా అంగీకారం తెలిపినట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో తనపై ఈడీ సోదాలు నిర్వహించడం ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. రాష్ట్రంలో ఇలాంటి కేసులు సుమారు 140 మంది వరకు ఉండగా, తనపైనే ప్రత్యేకంగా సోదాలు నిర్వహించడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. ఈడీ అధికారులు తనిఖీల్లో ఎలాంటి అక్రమాలు గుర్తించలేదని, ఇంట్లోని బీరువాను సైతం పగలగొట్టి తనిఖీ చేయగా అందులో కేవలం రూ. 200 మాత్రమే లభించాయని పేర్కొన్నారు.

తన రైస్ మిల్లులను కూడా అమ్మకానికి పెట్టానని, వాటి వ్యవహారాల్లో ఎలాంటి అక్రమాలకు తావులేదని తెలిపారు. ఇటీవల తాను (Rekha Naik) ప్రజాక్షేత్రంలో విస్తృతంగా పర్యటిస్తుండటాన్ని కొందరు జీర్ణించుకోలేక కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తన రాజకీయ ఎదుగుదలను ఓర్వలేకే ఇలాంటి చర్యలకు దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈడీ అధికారుల సోదాలకు పూర్తిస్థాయిలో సహకరించానని, ప్రజలకు తాను ఎలాంటి అన్యాయం చేయలేదని స్పష్టం చేశారు.

Also Read : “అధికార అహంకారంతో మాట్లాడొద్దు”.. సీఎం కు రాజగోపాల్ రెడ్డి కౌంటర్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>