కలం, యాదగిరిగుట్ట: తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి జన్మ నక్షత్రమైన స్వాతి సందర్భంగా ఆలయంలో సోమవారం తెల్లవారుజామున గిరిప్రదక్షిణ వేడుక వైభవంగా జరిగింది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య (MLA Beerla Ilaiah) పాల్గొని, స్వామివారికి ప్రత్యేక ప్రార్థనలు సమర్పించారు.
తెల్లవారుజామున 3 గంటలకే ప్రారంభమైన గిరిప్రదక్షిణలో (Yadadri Giripradakshina) బీర్ల ఐలయ్య కాలినడకన పాల్గొంటూ స్వామివారి దివ్య నామస్మరణ చేశారు. అనంతరం కొండపై వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామివారిని దర్శించుకుని, ఆలయ అర్చకుల సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు ఆయనకు స్వామివారి శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలు అందజేసి వేదాశీర్వచనం అందించారు.
పూజా కార్యక్రమాల అనంతరం ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మాట్లాడుతూ.. “శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దివ్య ఆశీస్సులు తెలంగాణ ప్రజలందరిపై ఎల్లవేళలా ఉండాలని కోరుకున్నాను. రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని, మన తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో సుభిక్షంగా వర్ధిల్లాలని స్వామివారిని వేడుకున్నాను” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు.

