కలం, వరంగల్ బ్యూరో : వరంగల్, హనుమకొండ, కాజీపేట ట్రై సిటీలో (Belt Shops) మద్యం సిండికేట్ దందాగా మారింది. ఆపై అనధికారిక అమ్మకాల జోరు కొనసాగుతోంది. ఇప్పటికే ట్రై సిటీలో భారీగా బార్లు, వైన్స్ షాపులు ఉండగా.. వాటికి అదనంగా బెల్ట్‌షాపులు వచ్చాయి. వరంగల్ రూరల్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో సుమారు 200 వరకు, అర్బన్ పరిధి హనుమకొండ, కాజీపేట ప్రాంతాల్లో మరో 150 వరకు బెల్ట్‌షాపులు ఉన్నట్టు తెలుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో వేళాపాళా లేకుండా మద్యం అమ్మకాలు జరుగుతున్నట్లు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు పేర్కొంటున్నారు. మరోవైపు ఎక్సైజ్, పోలీసు శాఖల నిఘా, తనిఖీలపైనా ప్రశ్నలు వస్తున్నాయి.
నిబంధనలు బేఖాతర్
అనుమతులు లేకుండా మద్యం విక్రయించడం, నిర్ణీత సమయాలకు మించి షాపు ఓపెన్ చేయడం స్థానికంగా సమస్యలకు కారణమవుతున్నాయి. ముఖ్యంగా ఇళ్ల ప్రాంతాల్లో బెల్ట్‌షాపులతో ప్రజలు పలు సమస్యలు ఎదుర్కొంటున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. మద్యం విక్రయాలపై నిఘా పెట్టి ఎక్సైజ్ అధికారులు వెంటనే విచారణ చేపట్టాలనే డిమాండ్లు చేస్తున్నారు. ఇటీవల పోలీసులు కొన్ని చోట్ల దాడులు చేసి బెల్ట్‌షాపులపై చర్యలు తీసుకోవడంతో స్థానికులకు కొంత ఉపశమనం లభించినట్లు తెలుస్తోంది. అయితే దాడుల అనంతరం కూడా మరికొన్ని ప్రాంతాల్లో మద్యం విక్రయాలు కొనసాగుతున్నా యనే ఆరోపణలు ఉన్నాయి.
బార్ల నుంచే బెల్ట్ కు సరఫరా
ట్రైసిటీలో సుమారు 70 నుంచి 80 వరకు బార్లు, వీటికి తోడు ఇంకొన్ని ఎలైట్ బార్లు కూడా ఉన్నాయి. అయితే కొన్ని బార్లలో బిజినెస్ ఆశించిన స్థాయిలో నడవకపోవడంతో కొందరు నిర్వాహకులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకున్నారు. కొందరు నిర్వాహకులు సిండికేట్ అయి బెల్ట్‌షాపులకు మద్యం సరఫరా చేస్తూ, ఎక్కువ ధరలకు అమ్ముతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.
పర్యాటకులకు ఇబ్బందులు
ఖిలా వరంగల్ లో బెల్ట్‌షాపుల నిర్వహణ స్థానికులకు, పర్యాటకులకు ఇబ్బందికరంగా మారుతోంది. చారిత్రక కట్టడాలు, పర్యాటక ప్రదేశాలను సందర్శించేందుకు రాష్ట్రంలోని వివిధ జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. కొన్ని ప్రాంతాల్లో బెల్ట్‌షాపుల కారణంగా మద్యం విక్రయాలు, రాత్రివేళల్లో మద్యం తాగే వారి సంఖ్య పెరుగుతోంది. మద్యం తాగిన అనంతరం ఖాళీ సీసాలను నిర్మానుష్య ప్రాంతాల్లో, రోడ్ల వెంట పడేస్తున్నారు. రాత్రివేళల్లో ఎక్కడపడితే అక్కడ మద్యం సీసాలు పడేయడం, మద్యం తాగి తిరిగేవారి కారణంగా పర్యాటకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. పర్యాటక ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితులు ఉంటే సందర్శకులకు అసౌకర్యం కలగడమే కాకుండా స్థానిక వాతావరణంపైనా ప్రభావం పడే అవకాశం ఉంది.
పండుగ వేళ అమ్మకాలపై లేని నిఘా
దసరా నేపథ్యంలో మద్యం విక్రయాలు పెరిగే అవకాశముండటంతో బార్లు, వైన్స్, బెల్ట్‌షాపులపై ప్రత్యేక నిఘా అవసరముంది. విక్రయాల లక్ష్యాలు, వ్యాపార ప్రయోజనాలతోనే నిబంధనల ఉల్లంఘనలకు అవకాశం కల్పిస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే బార్లు, వైన్స్ నిర్వాహకులు అక్రమ విక్రయాలను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలపై అధికారులు సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను తేల్చాల్సి ఉంది. ట్రైసిటీలో బెల్ట్‌షాపుల విక్రయ కేంద్రాలను గుర్తించడంతోపాటు మద్యం సరఫరా వ్యవస్థపై దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు. ఎక్సైజ్, పోలీసు శాఖలు సంయుక్తంగా తనిఖీలు చేపట్టి, అనుమతులు లేకుండా మద్యం విక్రయిస్తున్న వారితోపాటు నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఖిలా వరంగల్ వంటి పర్యాటక ప్రాంతాల్లో నిరంతర నిఘా ఏర్పాటు చేస్తేనే బెల్ట్‌షాపుల దందాకు అడ్డుకట్ట పడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

