కలం, యాదగిరిగుట్ట: యాదాద్రి భువనగిరి (Yadadri Bhuvanagiri) జిల్లా కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం (Congress Protest) నిర్వహించారు. ఏఐసీసీ, పీసీసీ ఇచ్చిన పిలుపు మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
భువనగిరి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించి ర్యాలీగా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఇంచార్జి కలెక్టర్ భాస్కర రావుకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య మాట్లాడుతూ.. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల సంఘానికి అత్యంత కీలకమైన బాధ్యత ఉందన్నారు. ప్రతి ఓటరుకు తన ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునే అవకాశం కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందన్నారు. ప్రతిపక్షాలు లేవనెత్తుతున్న ఓటర్ల జాబితా, ఓట్ల తొలగింపు తదితర అంశాలపై సమగ్రంగా విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉందని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ లేవనెత్తిన ఆరోపణలపై ఎన్నికల సంఘం స్పష్టమైన సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. భారతదేశంలో 13 కోట్ల ఓట్లు తొలగింపు, తెలంగాణ రాష్ట్రంలో 72 లక్షల ఓట్లు తొలగింపు జరిగిందని. కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్న ఓట్లనే తొలగింపు చేశారని ఆరోపించారు. ఓటు అనేది ప్రతి భారతదేశ పౌరుడి ప్రజాస్వామ్య హక్కు అని, ఆ హక్కుకు ఎలాంటి భంగం కలగకూడదని పేర్కొన్నారు. ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో పారదర్శకమైన విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
CEC శ్రీ జ్ఞానేష్ కుమార్ తీసుకున్న నిర్ణయాలపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోందని, ఈ వ్యవహారంపై నైతిక బాధ్యత వహిస్తూ ఆయన వెంటనే రాజీనామా చేయాలని ఏఐసీసీ, పీసీసీ డిమాండ్ చేశాయని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని అన్నారు.
ఓటు హక్కు పరిరక్షణ కోసం ప్రజల పక్షాన నిలబడి పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా, నియోజకవర్గ స్థాయి నాయకులు, ప్రజాప్రతినిధులు, యువజన కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ, ఇతర అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

