కలం, నిర్మల్: ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు నూతన వధువులకు తులం బంగారం (Tulam Gold) ఎప్పుడు అందిస్తారని బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి (MLA Maheshwar Reddy) రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గురువారం సారంగాపూర్, నిర్మల్ అర్బన్, నిర్మల్ రూరల్, సోన్, లక్ష్మణచందా మండలాలకు చెందిన 213 మంది లబ్ధిదారులకు ఆయా మండలాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద కుటుంబాల్లో ఆడపిల్లల వివాహాలకు ప్రభుత్వం అందించే ఆర్థిక సాయం ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు.
అయితే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో నూతన వధువులకు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విషయాన్ని విస్మరించిందని విమర్శించారు. బంగారం ధరలు పెరగడానికి కేంద్ర ప్రభుత్వమే కారణమని కాంగ్రెస్ నాయకులు వ్యాఖ్యానించడం వారి అవగాహన లేమికి నిదర్శనమని అన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఇతరులపై నెపం నెట్టడం సరికాదని, ప్రభుత్వం ఇప్పటికైనా తులం బంగారం హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
Also Read : భారత్ వ్యతిరేక శక్తుల కోసమే రాహుల్ పనిచేస్తున్నారు: కిషన్ రెడ్డి
Follow Us On : WhatsApp

