కలం, ఖమ్మం బ్యూరో: గడిచిన పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్ర ఇరిగేషన్ రంగంపై ఏకంగా 1.81 లక్షల కోట్లు ఖర్చు పెట్టినప్పటికీ, ఆ నిధులన్నీ పూర్తిగా నీటిపాలయ్యాయని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం సీతా రామ ప్రాజెక్టును ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వ నిర్వాకం వల్లనే ఇరిగేషన్ శాఖ సర్వనాశనమైందని మండిపడ్డారు.
ముఖ్యంగా ఖమ్మం జిల్లాకు ఆశాకిరణంగా మారాల్సిన సీతారామ ప్రాజెక్టుపై ఎనిమిదిన్నర వేల కోట్లు ఖర్చు చేసినా, ఒక్క ఎకరానికి కూడా నీరు పారించలేకపోయారని నిశితంగా విమర్శించారు. కేవలం సీతారామ మాత్రమే కాకుండా పాలమూరు రంగారెడ్డి, ఎస్‌ఎల్ బీసీ, కల్వకుర్తి, నెట్టెంపాడు వంటి కీలక ప్రాజెక్టులలో ఏ ఒక్కదాన్ని కూడా గత ప్రభుత్వం పూర్తి చేయలేకపోయిందని ఎండ గట్టారు.
బీఆర్ఎస్ హయాంలోనే నిర్మితమై, వారి కాలంలోనే దెబ్బతిన్న కాళేశ్వరం ప్రాజెక్టుపై మంత్రి సంచలన విషయాలను వెల్లడించారు. ప్రాజెక్ట్ డీపీఆర్ లో ఉన్న నిబంధనలను బేఖాతరు చేస్తూ కాళేశ్వరాన్ని నిర్మించారని, అక్కడ ఫౌండేషన్ అస్సలు బాగోలేదని నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (NDSA) తన నివేదికలో స్పష్టంగా తేల్చిందని పేర్కొన్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీలలో నీటిని నిల్వ చేస్తే అవి పూర్తిగా కూలిపోయే ప్రమాదం ఉందని ఎన్‌డీఎస్‌ఏ హెచ్చరించడం వల్లనే తాము అక్కడ నీటిని స్టోర్ చేయడం లేదని స్పష్టం చేశారు. అలాగే కాళేశ్వరం బ్యారేజీల నుంచి ఒక్క చుక్క నీటిని కూడా వినియోగించకుండానే, రాష్ట్రంలో, దేశంలోనే అత్యధిక స్థాయిలో వరిని పండించి చూపించామని సగర్వంగా ప్రకటించారు. ఈ సీజన్‌లో ఏకంగా 82 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి, రూ.19 వేల కోట్లను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశామని వివరించారు.
ప్రస్తుత ఎల్ నినో పరిస్థితులను అడ్డుపెట్టుకుని, కేవలం రాజకీయ లబ్ధి కోసమే బీఆర్ఎస్ పార్టీ ఇరిగేషన్ అంశాలపై రాజకీయం చేస్తోందని ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ఈ రాష్ట్రాన్ని నడిపించడంలో ఖమ్మం జిల్లా మంత్రులు కీలక పాత్ర పోషిస్తున్నారని, వారి పూర్తి సహకారంతో సీతారామ ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేసి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. అలాగే సీతమ్మ సాగర్ బ్యారేజ్ నిర్మాణానికి అడ్డుగా ఉన్న న్యాయపరమైన చిక్కులన్నింటినీ తొలగించి తిరిగి పనులను వేగంగా మొదలు పెడతామని వెల్లడించారు. త్వరలోనే టెస్టింగ్ అండ్ రీహాబిలిటేషన్ ప్రక్రియను పూర్తి చేసి, కాళేశ్వరాన్ని కూడా సురక్షితంగా తిరిగి అందుబాటులోకి తీసుకువస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

