తెలంగాణ స‌ర్కార్ వ‌రుణ‌యాగం ప్రారంభం!

కలం, నాగార్జున సాగర్: తెలంగాణ రాష్ట్రంలో ఎల్ నినో ప్రతికూల ప్రభావం తగ్గి, సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలనే సత్సంకల్పంతో ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ‘వరుణ యాగం’ నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ వద్ద కృష్ణా నదీ తీరాన వేకువజామున 4.05 గంటలకు వైభవంగా ప్రారంభమైంది. వేద పండితుల మంత్రోచ్ఛారణలు, సాంప్రదాయ గోపూజతో ఈ ఆధ్యాత్మిక క్రతువుకు శ్రీకారం చుట్టారు.

రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు ఈ యాగంలో ప్రత్యక్షంగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాగార్జున సాగర్ జలాశయం సమీపాన పవిత్ర నదీ జలాల సాక్షిగా జరుగుతున్న ఈ యజ్ఞం రాష్ట్రంలో కరువు కాటకాలు తొలిగి, జలాశయాలన్నీ జలకళతో తొలకడలాడాలని ఆకాంక్షిస్తూ సాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా కృష్ణానది తీరాన నాగార్జునసాగర్ లో మహా వరుణ యాగాన్ని నిర్వహిస్తోంది. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, కృష్ణా, గోదావరి నదులు జలకళతో పరవళ్లు తొక్కాలని, రైతాంగం సుభిక్షంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించి ఈ యాగం నిర్వహిస్తోంది. వేకువ జామున నాలుగు గంటలకే మొదలైన మహా వరుణ యాగంలో రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు ఆది పూజ నిర్వహించి యాగాన్ని ప్రారంభించారు.

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ అర్చకులు, వేదపండితుల ఆధ్వర్యంలో యాగ క్రతువు కొనసాగుతోంది. వేద పండితులు, 11 హోమ గుండాల్లో దేవతా ఆవాహనం చేసి వరుణ యాగాన్ని ప్రారంభించారు. తొలుత వేద పండితులు, రిత్వికులు మంత్రోచ్ఛారణల మధ్య విశ్వక్సేనుడికి ప్రత్యేక పూజలు చేశారు. యాగం నిర్విఘ్నంగా సాగాలని విగ్నేశ్వరుడిని పూజించారు. యాగస్థలం, యజమానులు, పాల్గొనే ఋత్వికుల శుద్ధి చేసి పుణ్యాహ వాచనంతో యాగశాల ప్రవేశం చేశారు. పవిత్ర కృష్ణానది జలంతో కలశాలను ఏర్పాటు చేసి, వాటిలో దేవతా ఆవాహనం చేసి కలశ స్థాపన చేశారు. 108 మంది రుత్వికులు.. 11 హోమగుండాలు.. యాగశాల అంతా ఆధ్యాత్మిక శోభతో నిర్విరామంగా కొనసాగుతోంది. వరుణుడి కరుణ కోసం రుత్వికులు వేద పండితులు చతుర్వేద వేద పారాయణాలు, లక్ష జపాలు పట్టిస్తున్నారు. వేద పండితులు రుత్వికుల మంత్రోచ్ఛారణలతో విజయ విహార్ ప్రాంగణం మారుమోగుతోంది.

ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జయవీర్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి, శాసనమండలి సభ్యులు కేతవత్ శంకర్ నాయక్, జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, రాష్ట్ర దేవాదాయ కమిషనర్ హనుమంతరావు, స్థానిక సంస్థల ఇంచార్జి అదనపు కలెక్టర్ ప్రేమ్ కరణ్ రెడ్డి, మిర్యాలగూడ ఆర్‌డీఓ రమణారెడ్డి, రెవెన్యూ, పోలీస్ అధికారులు, ఇతర అధికారులు ఉన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>