Mobile Popup Ad
Mobile Popup Ad

ఆధునిక వ్యవసాయంతో అధిక ఆదాయం సాధ్యం : మంత్రి తుమ్మల

కలం, ఖమ్మం బ్యూరో : ఆధునిక వ్యవసాయ పద్ధతులతో రైతులు అధిక ఆదాయం సాధించవచ్చని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Tummala) స్పష్టం చేశారు. సోమవారం రఘునాథపాలెం మండలం రైతు వేదికలో నిర్వహించిన ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమంలో మంత్రి తుమ్మల, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రైతులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందించేందుకు శాస్త్రవేత్తలను గ్రామస్థాయికి తీసుకువెళ్తున్నట్లు తెలిపారు.

ఏ పంటలు సాగు చేయాలి, ఎంత ఎరువు వాడాలి, తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి ఎలా సాధించాలనే అంశాలపై రైతులు అవగాహన పెంచుకోవాలని సూచించారు. రాబోయే మే నెలలో గోద్రేజ్ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభం కానుందని, జిల్లాలో నర్సరీ స్థాపనకు సంస్థ ఆసక్తి చూపుతోందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో వ్యవసాయ యాంత్రీకరణకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని, ప్రస్తుత ప్రభుత్వం ఆ రంగానికి నిధులు కేటాయించేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు. రైతులే తమ అవసరాలను తెలియజేయాలని కోరారు. ఆయిల్ పామ్ సాగుపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సూచించిన మంత్రి, ఈ పంటకు నాలుగేళ్ల పాటు ఎకరాకు రూ.51 వేల సబ్సిడీ అందుతుందని తెలిపారు. ఇది 40 సంవత్సరాల పాటు ఆదాయం ఇచ్చే లాభదాయక పంట అని పేర్కొన్నారు. అంతర పంటలుగా పత్తి, మిర్చి, పప్పుధాన్యాలు, మొక్కజొన్న సాగు చేయవచ్చని చెప్పారు.

అనంతరం జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. మాట్లాడుతూ, భవిష్యత్తులో ఆహార భద్రత కీలక అంశమవుతుందని తెలిపారు. సరైన సాంకేతిక పరిజ్ఞానంతో వ్యవసాయం చేస్తే ఎకరాకు రూ.2–3 లక్షల ఆదాయం సాధ్యమని చెప్పారు. యూరియా వాడకాన్ని తగ్గించి ఆర్గానిక్ వ్యవసాయంపై దృష్టి పెట్టాలని సూచించారు. రసాయనాలతో పండించిన ఆహారం ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని ఆయన హెచ్చరించారు. రైతులకు శాస్త్రీయ అవగాహన కల్పించేందుకు ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నిపుణులు పాల్గొన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు, అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>